అంకార : టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌కు భారీ భూకంపం ముంచుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇది ఇటీవల కాలిఫోర్నియాను కుదిపేసిన తీవ్రతకన్నా, అంటే రిక్టర్ స్కేల్‌పై 7.1 శాతం నుంచి 7.4 శాతం వరకు ఉండవచ్చని నిపుణుల అధ్యయనంలో తేలింది. మార్మరా సముద్రం అట్టడుగు భాగంలో భూ పొరల మధ్య ఒత్తిడి బాగా పెరుగుతోందని, దాని పర్యవసానంగా భారీ భూకంపం వచ్చే ప్రమాదం పూర్తిగా ఉందని ‘జీయోసీ’ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రొఫెసర్ హైడ్రన్ కోప్ హెచ్చరించారు. 1776లో ఇస్తాంబుల్ నగరంలో వచ్చిన 7.5 స్థాయి భూకంపంలో వేలాది మంది మరణించారు.
భూ ఉపరితలం పైన సంభవించే భూకంపాలను శాటిలైట్ ఛాయా చిత్రాల ద్వారా అంచనా వేయవచ్చని, సముద్ర గర్భంలో వచ్చే భూకంపాలను ఈ పద్ధతిలో అంచనా వేయలేమని హైడ్రన్ కోప్ తెలిపారు. నీటిలో 800 మీటర్ల లోతున, సముద్రంలో వివిధ భాగాల్లో జరిపిన పరీక్షల్లో భూకంపాలు పొంచి ఉన్నట్లు తేలిందని ఆయన చెప్పారు. ఎంతకాలంలో ఈ భూకంపాలు వస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. 1999లో ఇదే నగరంలో 7.1 నుంచి 7.4 మధ్య తీవ్రతతో వచ్చిన భూకంపాల్లో 17 వేల మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment