విమానం కోసం 'రెండింతల' గాలింపు!
కౌలాలంపూర్:ఎమ్ హెచ్ 370.. మలేషియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం. మార్చి 8, 2014న ఐదుగురు భారతీయులతో సహా 239 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు బయలుదేరిన ఆ విమానం అదృశ్యమై సంవత్సరం పైగా కావొస్తున్నా.. ఇప్పటి వరకూ ఆచూకీ అయితే లేదు. ఎమ్ హెచ్ 370 విమాన అదృశ్య ఘటనకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్నా.. ఆ విమాన జాడ కనిపెట్టేందుకు మలేషియా ప్రభుత్వం మాత్రం తమ కార్యాచరణను యథావిధిగా కొనసాగిస్తోంది.
విమాన శకలాలను కనుగొనేందుకు ప్రపంచ దేశాల సహాయం తీసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మిగలడంతోమరో అడుగు ముందుకేయాలని యత్నాలు చేస్తోంది. ఇప్పటివరకూ దక్షిణ హిందూ మహా సముద్రంలో అరవై వేల చదరపు కిలోమిటర్ల మేర విమాన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోవడంతో.. అదనంగా మరో అరవై వేల చదరపు కిలోమీటర్ల మేర అన్వేషణ చేపట్టాలని భావిస్తోంది. ఒకవేళ విమాన ఆచూకీ మే నెల లోపు దొరకపోతే మాత్రం ఈ మేరకు ప్రయాత్నాలు చేపట్టాలని మలేషియా యోచిస్తోంది. అందుకు మలేషియాతో పాటు ఆస్ట్రేలియా, చైనాలు మరోసారి భాగస్వామ్యం కావడానికి సన్నద్ధమవుతున్నాయి.