అసలు ఆ విమానం జాడ తెలిసేనా ?
అదేమిటోగాని చూడబోతే 'విధి చేయూ వింతలన్నీ మతిలేని చేష్టలు' లాగానే ఉన్నాయి. నిన్న గాక మొన్న ఇండోనేసియాలో 54 మందితో వెళ్తు కుప్పకూలిన విమానం ఆచూకీ 12 గంటల్లో ఆచూకీ కనుగొన్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న విమానం, హెలికాప్టర్ కానీ ఆదృశ్యమైనా... ఇట్టే గాలింపు జరిపి అట్టే ఆచూకీ కనుగొంటున్నారు. కానీ గతేడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్ 370 విమానం ఆచూకీ మాత్రం ఇప్పటికీ అతీగతి లేదు. గత నెలలో ఫ్రెంచ్ ద్వీపం రీయూనియన్ వద్ద కనుగొన్న విమాన శకలాలు సదరు విమానానివే అంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.
దాంతో గల్లంతైన విమాన ప్రయాణికుల బంధువుల్లో ఆశలు చిగురించాయి. ఇంతలో విమాన శకలాల కోసం మలేసియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ సిబ్బందితో రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించాయి. దాదాపు 10 రోజుల పాటు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చిన్న ముక్క కూడా కనుక్కోలేకపోయారు. దాంతో విసుగొచ్చిందో ఏమో... ఆ విమానాన్ని వెతుకులాడేందుకు చేపట్టిన చర్యలను తగ్గించేస్తున్నట్లు ఫ్రాన్స్ సోమవారం ప్రకటించింది.
ఈ వార్త విని ఎంహెచ్ 370 విమాన ప్రయాణికుల బంధువులు మళ్లీ తీవ్ర నిరాశలోకి కురుకుపోయారు. ప్రమాదం జరిగిన అన్నిలోహవిహంగాల సమాచారం దొరుకుతున్నాయే కానీ... గగనంలోకి ఎగిరిన ఈవిమానం జాడ మాత్రం అంతుచిక్కడం లేదు... ఇవాళ కాకుంటే రేపైనా...రేపు కాకుంటే ఎల్లుండైనా... విమాన ఆచూకి తెలుస్తుందని వారంతా చిగురంత ఆశతో బతుకుతున్నారు.
239 మంది ప్రయాణికులు, సిబ్బందితో ఎంహెచ్ 370 విమానం గతేడాది మార్చి 8న మలేసియా నుంచి చైనా రాజధాని బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే మలేసియా విమానాశ్రయ ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కోసం ప్రపంచ దేశాలు కలిసికట్టుగా గాలింపు చర్యలు చేపట్టన ఫలితం మాత్రం కనిపించలేదు.
అసలు ఆ విమానం ఏమైంది... తమ బంధువులు బతికే ఉన్నారా ? లేక మరణించారా ? ఆ విమానం జాడ తెలుస్తోందా ? అనే ప్రశ్నలతో సదరు ప్రయాణీలకు బంధువులు తీవ్ర వేదన చెందుతున్నారు. ఈ ఏడాది ఎంహెచ్ 370 విమానంలోని ప్రయాణికులంతా మరణించారని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వ ప్రకటనను ప్రయాణికుల బంధువులు మాత్రం విశ్వసించడం లేదు. దీనిపై తమకు పూర్తి ఆధారాలు కావాలని వారు పట్టుబడుతున్న విషయం విదితమే.