ట్రంప్ భద్రత తలకు మించిన భారమా?
⇔ ట్రంప్ అదనపు భద్రతా భారం రూ.392కోట్లు
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద నేతగా పేరున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అదనపు భద్రత కోసం అమెరికా భారీగా ఖర్చుపెట్టనుంది. దీనికి సంబంధించి అదనంగా 60 మిలియన్ డాలర్లు(రూ.392 కోట్లు) ఇవ్వాలని అధ్యక్షుడి భద్రతకు బాధ్యత వహించే సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కోరింది. ట్రంప్ కుటుంబం నిత్యం ప్రయాణాలతో, వివాదాలతో సావాసం చేస్తుండటంతో వీరి భద్రత సీక్రెట్ సర్వీస్ వర్గాలకు తలకు మించిన భారంగా పరిణమించింది. తొలుత అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ కోరిన 60 మిలియన్ డాలర్లలో దాదాపు 26 మిలియన్ డాలర్లు న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్, అధ్యక్షుడి కుటుంబ సభ్యుల రక్షణకు వెచ్చిస్తారు. మిగిలిన 33 మిలియన్ డాలర్లలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వంటి కీలక నాయకుల పర్యటనలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల కోసం వినియోగిస్తారు. మన్‌హట్టన్‌లోని మూడంతస్తుల పెంట్ హౌస్‌లో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు నివసిస్తుండడం తెలిసిందే.