ఘుమఘుమలతో నిద్ర లేవండి...
తెలతెలవారుతూండగా ‘‘కౌసల్యా సుప్రజా రామా...’’ అంటూ మంద్రంగా సుబ్బు లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తూంటే... వంటింట్లోంచి కాఫీ ఘుమఘుమలు ముక్కు పుటాలకు చేరుతూంటే.. అది గుడ్ మార్నింగే అవుతుంది. ఈ అనుభూతి రోజూ పొందాలను కుంటున్నారా? మీకిష్టమైన సంగీతంతోపాటు... సువాసనలూ ఆస్వాదిస్తూ నిద్రలేవాలనుకుంటున్నారా? అయితే సెన్సర్ వేక్ అలారమ్ క్లాక్ మీ కోసమే! ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిన ఓ టేబుల్‌టాప్ అలారమ్ క్లాక్‌తోపాటు కొన్ని సెన్సర్ల సాయంతో కమ్మని వాసనలు వెలువరించే ఓ పరికరాన్నీ తయారు చేసింది మరి. ఈ పరికరంలో భారతీయ వంటకాల వాసనలేవీ ప్రస్తుతానికి లేకున్నా.. బ్రెడ్ రోస్ట్, ఎస్‌ప్రెస్సో కాఫీలతోపాటు పీచ్, స్ట్రాబెర్రీ కాండీ, అల్లం, పెప్పర్‌మింట్ సువాసనలను వెదజల్లుతుంది.
నిద్ర లేవాలనుకున్న సమయాన్ని సెట్ చేసుకోవడం.. వాసనలు వెదజల్లే క్యాప్సూల్‌ను పరికరంలో పడేయడం మాత్రమే మనం చేయాల్సిన పనులు. గివావుడాన్ అనే కంపెనీ సెన్సర్ వేక్ కోసం సువాసనల క్యాప్సూళ్లను తయారు చేస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది నవంబర్‌కల్లా సెన్సర్ వేక్ మార్కెట్‌లోకి రానుంది.