జడ్జి, దొంగ....చిన్ననాటి స్నేహితులు
మియామీ: మియామీలోని ఓ కోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కేసు విషయమై నిందితుడుగా ఉన్న ఆథర్ బూత్ అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు. అయితే అక్కడ జడ్జిగా ఉన్న మహిళ మిండి గ్లేజర్ ఆ నిందితున్ని చూడగానే తన చిన్ననాటి స్నేహితుడిగా గుర్తించి పలకరించారు. అంతే.. నిందితుడుగా నిలుచున్న ఆథర్ ఆ మహిళా జడ్జిని గుర్తుపట్టి పశ్చాత్తాపంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలి స్థానాన్ని, తన ప్రస్తుత పరిస్థితిని తలచుకొని కుంగిపోయాడు. ఆ జడ్జి మాత్రం.. మనం అప్పుడే వయసులో ఎంత పెద్ద వాళ్లమైపోయామో తలచుకుంటే బాధగా ఉంది అంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమయ్యాడు.
''మేమిద్దరం కలిసి చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లం, మా స్కూల్ పిల్లలందరిలో ఆథర్ చాలా మంచివాడు'' అని ఆ మహిళా జడ్జి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నింటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడు నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఆ జడ్జి ఆకాంక్షించారు. కాగా దోపిడీ కేసులో 44 వేల డాలర్ల పూచీకత్తు పై అతనికి బెయిల్ మంజూరైంది.