విజయసాధనకు అకుంఠిత దీక్ష అవసరమని అంటారు. పట్టుదలతో లక్ష్యం దిశగా పయినించినవారు తప్పక విజయం సాధిస్తారని కూడా చెబుతుంటారు. ఈ కోవలోకే వస్తారు యాసిన్ షా మహ్మద్. ఈయన జీవితం ఒక సినిమాను తలపిస్తుంది. తన ప్రయాణంలో ఎన్నో సంఘర్షణలు ఎదుర్కొన్న యాసిన్ చివరకు విజయబావుటా ఎగురవేశాడు.
జీవితంలో ఎత్తుపల్లాలు, మలుపులు
ఇటీవల జరిగిన కేరళ జ్యుడీషియల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యాసిన్ షా మహ్మద్ రెండో స్థానం సాధించాడు. దీంతో సివిల్ జడ్జి అయ్యే అర్హత సాధించాడు. డెలివరీ బాయ్ నుండి మేజిస్ట్రేట్ అయ్యే దిశగా సాగిన యాసిన్ జీవన ప్రయాణంలో అనేక మలుపులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. యాసిన్‌కు మూడేళ్ల వయసున్నప్పడే అతని తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టివెళ్లిపోయాడు. నాడు 19 ఏళ్లు ఉన్న అతని తల్లి.. పిల్లలను పెంచిపోషించింది. శిథిలావస్థకు చేరిన ఇంట్లో ఉంటూ, వారు కాలం వెళ్లదీశారు. రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద వారికి ఒక చిన్న ఇంటి సౌకర్యం లభించినప్పటికీ, వారికి అది ఏమాత్రం అనువుగా ఉండేది కాదు.
న్యూస్ పేపర్ పంపిణీ చేస్తూ..
యాసిన్ తన బాల్యంలో ఉదయం 4 గంటలకు నిద్రలేచి వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. తరువాత 7 గంటల నుండి పాల ప్యాకెట్లు పంపిణీ చేసేవాడు. ఇది పూర్తయ్యాక స్కూలుకు వెళ్లేవాడు. యాసిన్ తల్లి రెండు పాడి ఆవును కొనుగోలు చేసి, వాటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని సాకేది. యాసిన్ తన ఆరేళ్ల వయసు నుంచే ఆదాయం వచ్చే పనులు చేసేవాడు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాలు పంపిణీ చేసేవాడు.
స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం..
సమయం చిక్కినప్పుడు యాసిన్ పెయింటర్‌గా, జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గానూ పనిచేశాడు. ఇతరుల నుంచి పాత పుస్తకాలు సేకరించి చదువుకునేవాడు. అలాగే ఇతరులిచ్చే పాత దుస్తులు ధరించేవాడు. రోజులో ఏది దొరికితే దానిని తిని కడుపునింపుకునేవాడు. ఇలా పనిచేస్తూనే 12వ తరగతి పూర్తిచేసిన యాసిన్ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సులో చేరేందుకు షోరనూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఈ కోర్సు పూర్తయ్యాక స్టేట్ లా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి విని, దానికి ప్రిపేర్ కావాలని నిర్ణయించుకున్నాడు. యాసిన్ 46వ ర్యాంక్‌తో కేరళలోని ఎర్నాకులంలోని ప్రతిష్టాత్మక ప్రభుత్వ న్యాయ కళాశాలలో ప్రవేశం పొందాడు. ఈ సమయంలో రాత్రి 2 గంటల వరకు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేశాడు.
29 ఏళ్ల పోరాటం
యాసిన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను 12వ తరగతిలో ఫెయిల్ అయి, చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా పట్టుదల వీడక 12వ తరగతి పాస్ అయ్యాను. నేను మలయాళం మీడియం స్కూల్‌లో చదవడంతో ఇంగ్లీషులో చదవడం ఇబ్బందిగా అనిపించేంది. పట్టుదలతో ఈ సమస్యను కూడా అధిగమించాను’ అని తెలిపారు. యాసిన్ 2023 మార్చిలో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేయించుకున్నారు. తరువాత పట్టాంబి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది షాహుల్ హమీద్ దగ్గర పని చేశారు. ఈ సమయంలోనూ యాసిన్ వార్తాపత్రికలు విక్రయించడం, డెలివరీ బాయ్‌గా పనిచేయడాన్ని మానలేదు. యాసిన్ తనకు 29 ఏళ్ల వయసు వచ్చే వరకూ జీవితంతో పోరాడుతూనే వచ్చాడు. అయితే ఇదే సమయంలో తాను జడ్జి కావాలనుకున్న కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు యాసిన్ తాను అనుకున్న విధంగా జడ్జిగా మారి, పదిమందికి స్ఫూర్తిగా నిలిచారు.
ఇది కూడా చదవండి: ‘ఆంగ్లం’లో భారత్ స్థానం ఎంత? నాన్ ఇంగ్లీషులో టాప్ దేశమేది?
Comments
Please login to add a commentAdd a comment