defendant
-
AP: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావు అరెస్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏ-1 గంటా సుబ్బారావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఏబీసీ కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో షెల్ కంపెనీల ముసుగులో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) నిధులు కొల్లగొట్టిన కేసులో అరెస్టుల పర్వానికి తెరలేచింది. రూ. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధులను సీఐడీ అధికారులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఖన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్‌లను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది విజయవాడ తీసుకువచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. -
అనూష హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు): గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని కోట అనూష హత్య కేసులో నిందితుడు విష్ణువర్థన్‌రెడ్డిని గుంటూరు రూరల్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి, హత్య కేసు వివరాలను ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు. బొల్లాపల్లి మండలం పమిడిపాడుకు చెందిన మేడం విష్ణువర్ధన్‌రెడ్డి నరసరావుపేటలోని డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న అనూషను ప్రేమించాలంటూ వేధించేవాడు. ఈ క్రమంలో అనూష అదే కళాశాలలో చదివే మరో యువకుడితో చనువుగా ఉండటాన్ని గమనించి, నమ్మకంగా బయటకు తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసి.. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల్లి వనజాక్షి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్టు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని వెల్లడించారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసు నమోదు చేయడంతో పాటు 48 గంటల్లో చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడికి త్వరిత గతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయంలో ఈ కేసును మోడల్‌గా పరిగణిస్తామని ఎస్పీ వెల్లడించారు. చదవండి: అనూష కేసు: రెండేళ్లు గా వేధిస్తున్నాడు! నిండు గర్భిణిని కాళ్లతో తొక్కి చంపేశారు.. -
ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది...
పిఠాపురం(తూర్పుగోదావరి): వివాహేతర సంబంధం ఒకరిని జైలు పాలు చేస్తే.. మరో రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టింది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. శారీరక సుఖం కోసం కట్టుకున్న భర్తనే హతమార్చడానికి పథకం వేస్తే ఆ పథకమే ఆమె చావుకు కారణమైంది. పిఠాపురంలో ఈనెల 8వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసిన కాకినాడ డీఎస్పీ భీమారావు బుధవారం పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో కేసు వివరాలను మీడియాకు వివరించారు. స్థానిక కోటవారి వీధిలో రెడ్డెం శ్రీనివాసు తన రెండో భార్య స్వరూపారాణి, ముగ్గురు పిల్లలతో కలసి కాపురం ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అదే వీధిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చిన కోరుకొండ మండలం కనుపూరుకు చెందిన రెడ్డి వీరబాబుతో స్వరూపారాణి అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి ఇద్దరూ అర్ధరాత్రి మృతుడు శ్రీనివాస్ ఇంటిలో కలుసుకునే వారు. ఈ నేపద్యంలో వీరి వివాహేతర సంబంధం తెలుసుకున్న శ్రీనివాస్ పలు మార్లు మందలించగా, ఆమె తన భర్తను చంపి అడ్డు తొలగించాలని నిందితుడు వీరబాబుతో కలసి పథకం వేసింది. ఈనెల ఏడో తేదీ రాత్రి తన మోటారు సైకిల్‌పై కనుపూరు నుంచి వీరబాబు తన వెంట బలమైన చెక్కను తీసుకువచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మృతుడి భార్య సూచన మేరకు ఇంట్లోకి ప్రవేశించాడు. మృతుడు శ్రీనివాస్ ఒక గదిలో మడతమంచంపై నిద్రిస్తుండగా నిందితుడు తన వెంట తెచ్చుకున్న బలమైన చెక్కతో అతడి తలపై బలంగా మోదాడు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన శ్రీనివాస్ నాడి చూసి ఎలాంటి పరిస్థితుల్లో తన భర్త బతకకూడదని స్వరూపారాణి చెప్పడంతో నిందితుడు చెక్కతో మరింత బలంగా కొట్టాడు. మృతుడు తల పూర్తి గా ఛిద్రమైంది. అనంతరం తాము ముందు వేసుకున్న పథకం ప్రకారం ఎవరో బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసినట్టుగా చిత్రీకరించే పనిలో భాగంగా చనిపోయిన శ్రీనివాస్‌ను తాళ్లతో కట్టి గుట్టుచప్పుడు కాకుండా రక్తపు మరకలు కడిగేసుకుని, దుస్తులు మార్చుకుని తన మోటారు సైకిల్‌పై నిందితుడు తిరిగి వెళ్లిపోయాడు. అనంతరం ఉదయం ఎవరికీ అనుమానం రాకుండా తాను లేచి చూసేసరికి తన భర్త రక్తపు మడుగులో ఉన్నాడని భార్య స్వరూపారాణి కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పిఠాపురం సీఐ పి. రామచంద్రరావు, ఎస్సై శంకర్రావు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సాంకేతికపరమైన ఆధారాలతో నిందితులను గుర్తించగా, విషయం బయటకు తెలిసిపోతుందని, తనను పట్టుకుంటే అంతా నువ్వే చేయించావని చెబుతానని నిందితుడు వీరబాబు స్వరూపారాణిని ఫోన్లో బెదిరించడంతో ఎక్కడ తన బండారం బయటపడుతుందోననే భయంతో ఈనెల 12న తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె మృతి చెందింది. దీంతో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు నేర స్థలానికి దగ్గరలో ఉన్న సీసీ కెమెరా పుటేజీలతో పక్కా ఆధారాలతో నిందితుడిని ఈనెల 23న పిఠాపురంలో అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ రామంద్రరావు, ఎస్సై శంకర్రావు ఇతర పోలీసు సిబ్బందిని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు, జిల్లా ఎస్పీ అద్మాన్ నయీం అస్మీలు ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన తెలిపారు. చదవండి: నచ్చిన వారికి కొలువులు.. అడిగినంత వేతనం పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి -
నకిలీ చెక్కుల కేసులో వ్యక్తి లొంగుబాటు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సీఎం రిలీఫ్ ఫండ్ నకిలీ చెక్కులు సృష్టించిన భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రొద్దుటూరు పోలీసుల ముందు గురువారం లొంగిపోయారు. 25 వేల విలువ గల మూడు పాత చెక్కులను మార్ఫింగ్ చేసి 9 లక్షల 95 వేలతో నిందితుడు దొంగ చెక్కులను తయారు చేశాడు. కర్ణాటకలోని హోసూర్‌లో ఉండే సుబ్బిరామిరెడ్డి ద్వారా చెక్కులను మార్పింగ్ చేశారు. నకిలీ చెక్కులను గుర్తించిన బ్యాంకుల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం గుట్టురట్టయిం ఈ కేసును ప్రొద్దుటూరు డీఎస్పీ సుధాకర్ లోతుగా విచారణ చేపట్టారు. -
తప్పుకదమ్మా..
‘బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టరాదని, మద్యం అమ్మకాలు చేపడితే కేసుల్లో ఇరుక్కుంటామని, చేసింది తప్పని తెలిసినా బెల్టుల్లో మద్యం అమ్మకాల జోరు తగ్గడం లేదు.’ ఇంట్లో యజమానికి, అందివచ్చిన పిల్లలకు మద్యం జోలికి వెళ్లొద్దని చెప్పాల్సిన కొంతమంది మహిళలే బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ పట్టుబడటం విచిత్రం. ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలపై నమోదు చేస్తున్న కేసుల్లో 30 శాతం మహిళలు ఉంటున్నారు. విజయనగరం రూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా నిర్మూలిస్తామని ఇచ్చిన హామీ గాలిలోనే కలిసిపోయింది. దీంతో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలు ప్రకటించడంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు జూలై 19న బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు నెలలు ఎక్సైజ్ అధికారులు 510 కేసులు నమోదు చేశారు. వీటిలో 30 శాతం మంది మహిళలే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టి ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. లైసెన్స్డ్ మద్యం దుకాణాల నుంచి మద్యం బాటిళ్లు వారి భర్తలో, కుమారులో తీసుకువస్తే ఇంటివద్ద నిర్వహించే చిన్నచిన్న దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపడుతున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించే సమయాల్లో ఇళ్ల వద్ద వీరే ఉండటంతో అధికారులకు పట్టుబడి కేసుల్లో చిక్కుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఐదు నెలల కాలంలో 71 బెల్టు కేసులు నమోదు చేస్తే 24 కేసుల్లో మహిళలే ముద్దాయిలు కావడం విశేషం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ నమోదు చేసిన 99 కేసుల్లో 14 మంది మహిళలు పట్టుబడ్డారు. జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో జూలై 19 నుంచి నమోదైన కేసుల్లో 150మందికి పైగా మహిళలు బెల్టు దుకాణం కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంటి సభ్యులకు చెప్పాల్సిన మహిళలే ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఆందోళనకరమని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. బెల్టు దుకాణాలకు దూరంగా ఉండండి.. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించి కేసుల్లో ఇరుక్కోవడం బాధాకరం. ప్రతి మూడు నాలుగు కేసుల్లో ఒక మహిళ పట్టుబడటం విచారకరం. వీటి నిర్వహణలో మహిళలు దూరంగా ఉండాలి. గ్రామాల్లో బెల్టులు నిర్వహిస్తే అధికారులకు సమాచారం అందించడానికి మహిళలు ముందుకు రావాలి. – ఆరిక శంభూప్రసాద్, ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం -
ఖైదీని కౌగిలించుకున్న మహిళా జడ్జి
మియామీ: సరిగ్గా పదినెలల కింద మియామీలోని ఓ కోర్టులో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కేసులో నిందితుడుగా ఉన్న ఆథర్ బూత్ అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు. అయితే అక్కడ జడ్జిగా ఉన్న మహిళ మిండి గ్లేజర్ ఆ నిందితున్ని చూడగానే తన చిన్ననాటి స్నేహితుడిగా గుర్తించి పలకరించారు. అంతే.. నిందితుడుగా నిలుచున్న ఆథర్ ఆ మహిళా జడ్జిని గుర్తుపట్టి పశ్చాత్తాపంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలి స్థానాన్ని, తన ప్రస్తుత పరిస్థితిని తలుచుకొని కుంగిపోయాడు. ఆ జడ్జి మాత్రం.. మనం అప్పుడే వయసులో ఎంత పెద్ద వాళ్లమైపోయామో తలచుకుంటే బాధగా ఉంది అంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమయ్యాడు. ''మేమిద్దరం కలిసి చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లం, మా స్కూల్ పిల్లలందరిలో ఆథర్ చాలా మంచివాడు'' అని ఆ మహిళా జడ్జి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నింటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడు నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఆ జడ్జి అప్పడు ఆకాంక్షించారు. దోపిడీ కేసులో అతనికి జైలు శిక్ష పడింది. శిక్ష పూర్తవడంతో మంగళవారం జైలు నుంచి ఆథర్ విడుదలయ్యాడు. అతడిని కలవడానికి జస్టిస్ గ్లేజర్ జైలుకు వెళ్లారు. తన చిన్ననాటి స్నేహితుడు ఆథర్ కనబడగానే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఆథర్ ఇక నుంచి పరులకు ఉపకారం మాత్రమే చేస్తాడని జస్టిస్ గ్లేజర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జడ్జి గ్లేజర్ తనకు మార్గదర్శకురాలని ఆథర్ తెలిపాడు. -
జడ్జి, దొంగ....చిన్ననాటి స్నేహితులు
మియామీ: మియామీలోని ఓ కోర్టులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కేసు విషయమై నిందితుడుగా ఉన్న ఆథర్ బూత్ అనే వ్యక్తి కోర్టుకు వచ్చాడు. అయితే అక్కడ జడ్జిగా ఉన్న మహిళ మిండి గ్లేజర్ ఆ నిందితున్ని చూడగానే తన చిన్ననాటి స్నేహితుడిగా గుర్తించి పలకరించారు. అంతే.. నిందితుడుగా నిలుచున్న ఆథర్ ఆ మహిళా జడ్జిని గుర్తుపట్టి పశ్చాత్తాపంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తనతో చదువుకున్న చిన్ననాటి స్నేహితురాలి స్థానాన్ని, తన ప్రస్తుత పరిస్థితిని తలచుకొని కుంగిపోయాడు. ఆ జడ్జి మాత్రం.. మనం అప్పుడే వయసులో ఎంత పెద్ద వాళ్లమైపోయామో తలచుకుంటే బాధగా ఉంది అంటూ నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ అతను అదేమీ పట్టించుకోకుండా కన్నీటి పర్యంతమయ్యాడు. ''మేమిద్దరం కలిసి చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడుకునే వాళ్లం, మా స్కూల్ పిల్లలందరిలో ఆథర్ చాలా మంచివాడు'' అని ఆ మహిళా జడ్జి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులన్నింటి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడు నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఆ జడ్జి ఆకాంక్షించారు. కాగా దోపిడీ కేసులో 44 వేల డాలర్ల పూచీకత్తు పై అతనికి బెయిల్ మంజూరైంది.