‘బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టరాదని, మద్యం అమ్మకాలు చేపడితే కేసుల్లో ఇరుక్కుంటామని, చేసింది తప్పని తెలిసినా బెల్టుల్లో మద్యం అమ్మకాల జోరు తగ్గడం లేదు.’ ఇంట్లో యజమానికి, అందివచ్చిన పిల్లలకు మద్యం జోలికి వెళ్లొద్దని చెప్పాల్సిన కొంతమంది మహిళలే బెల్టు దుకాణాలు నిర్వహిస్తూ పట్టుబడటం విచిత్రం. ఎక్సైజ్ అధికారులు బెల్టు దుకాణాలపై నమోదు చేస్తున్న కేసుల్లో 30 శాతం మహిళలు ఉంటున్నారు.
విజయనగరం రూరల్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా నిర్మూలిస్తామని ఇచ్చిన హామీ గాలిలోనే కలిసిపోయింది. దీంతో ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ఎన్నికల హామీల్లో భాగంగా నవరత్నాలు ప్రకటించడంతో ఉలిక్కిపడ్డ సీఎం చంద్రబాబు జూలై 19న బెల్టు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐదు నెలలు ఎక్సైజ్ అధికారులు 510 కేసులు నమోదు చేశారు. వీటిలో 30 శాతం మంది మహిళలే బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపట్టి ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డారు. లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల నుంచి మద్యం బాటిళ్లు వారి భర్తలో, కుమారులో తీసుకువస్తే ఇంటివద్ద నిర్వహించే చిన్నచిన్న దుకాణాల్లో మద్యం అమ్మకాలు చేపడుతున్నారు.
ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించే సమయాల్లో ఇళ్ల వద్ద వీరే ఉండటంతో అధికారులకు పట్టుబడి కేసుల్లో చిక్కుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఐదు నెలల కాలంలో 71 బెల్టు కేసులు నమోదు చేస్తే 24 కేసుల్లో మహిళలే ముద్దాయిలు కావడం విశేషం. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ నమోదు చేసిన 99 కేసుల్లో 14 మంది మహిళలు పట్టుబడ్డారు. జిల్లాలోని 13 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో జూలై 19 నుంచి నమోదైన కేసుల్లో 150మందికి పైగా మహిళలు బెల్టు దుకాణం కేసుల్లో ఇరుక్కున్నారు. ఇంటి సభ్యులకు చెప్పాల్సిన మహిళలే ఇలా కేసుల్లో ఇరుక్కోవడం ఆందోళనకరమని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.
బెల్టు దుకాణాలకు దూరంగా ఉండండి..
బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు నిర్వహించి కేసుల్లో ఇరుక్కోవడం బాధాకరం. ప్రతి మూడు నాలుగు కేసుల్లో ఒక మహిళ పట్టుబడటం విచారకరం. వీటి నిర్వహణలో మహిళలు దూరంగా ఉండాలి. గ్రామాల్లో బెల్టులు నిర్వహిస్తే అధికారులకు సమాచారం అందించడానికి మహిళలు ముందుకు రావాలి.
– ఆరిక శంభూప్రసాద్, ఇన్‌చార్జి అసిస్టెంట్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment