అన్నం తింటున్నపుడు కూడా అదే మురికి వాసన.. | Sewer Cleaners Wanted in Pakistan Only They Need To Apply Condition | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌లో వారు మాత్రమే ఆ పోస్టులకు అర్హులు

Published Tue, May 5 2020 3:21 PM | Last Updated on Tue, May 5 2020 4:28 PM

Sewer Cleaners Wanted in Pakistan Only They Need To Apply Condition - Sakshi

డ్రైనేజీలో దిగి పనిచేస్తున్న కార్మికుడు(కర్టెసీ: న్యూయార్క్‌ టైమ్స్‌)

ఇస్లామాబాద్‌: ‘‘మురికి కాలువలో ఉన్నపుడు నా చుట్టూ బొద్దింకలు చేరతాయి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఘటనలు వెంటాడుతూనే ఉంటాయి. అన్నం తినడానికి ఎప్పుడైతే చేతిని నోటికి దగ్గరకు తీసుకువస్తానో అప్పుడు మురికి వాసనే వస్తుంది. ఇది అన్నిటికంటే చాలా కష్టమైన పని. ఒక్కోసారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేని దుస్థితి. పనిచేస్తూనే ఎప్పుడు ఎలా చనిపోతానో తెలియదు’’.. పాకిస్తాన్‌లోని కరాచీలో డ్రైనేజీ శుభ్రం చేసే జంషద్‌ ఎరిక్‌ అనే వ్యక్తి ఆవేదన ఇది. కుల, మత, జాతి వివక్షను ఎదుర్కొనే ఎరిక్‌ లాంటి ఇంకెంతో మంది పారిశుధ్య కార్మికులు అతడిలాగే కనీస సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలకు నోచుకోవడం లేదు. దేవుడి మీద భారం వేసి మురికి గుంటలోకి దిగడం.. అదృష్టం బాగుండి విష వాయువులు వెలువడక పోతే బతికి బయటపడటం. ఇదే వారి రోజువారీ దినచర్య. ప్రభుత్వం వారికి మాస్కులు గానీ, చేతులకు గ్లోవ్స్‌ గానీ అందించదు. ఇలాంటి కనీస సదుపాయాలు లేక ఇటీవలి కాలంలో అనేక మంది క్రిస్టియన్‌ కార్మికులు మృత్యువాత పడటం పాకిస్తాన్‌లో ఉన్న కుల, మత వివక్షకు అద్దం పడుతోందని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది. 

‘‘అనేక దశాబ్దాల క్రితం భారత్‌లో కుల వివక్ష, అంటరానితనం భరించలేక చాలా మంది మతం మారారు. 1947లో దేశ విభజన అనంతరం వీరిలో కొంతమంది పాకిస్తాన్‌కు వెళ్లారు. అయితే ముస్లిం మెజారిటీ దేశమైన ఆ దేశంలో మైనార్టీలుగా పరిగణింపబడుతున్న హిందూ, క్రిస్టియన్‌ వర్గాలు మాత్రమే మురికి కాలువలు శుభ్రం చేసే పనిచేయాల్సి ఉంటుంది. గతేడాది జూలైలో పాకిస్తాన్‌ సైన్యం ఓ పత్రికలో.. ‘‘కేవలం క్రైస్తవులు మాత్రమే స్వీపర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు వారు మాత్రమే అర్హులు’’ అంటూ ఓ వివాదాస్పద ప్రకటన విడుదల చేసిందంటే అక్కడ వివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అయితే ఇటువంటి అనుచిత ప్రకటనపై హక్కుల సంఘాలు భగ్గుమనడంతో వెనక్కి తగ్గిన అధికారులు మతం అనే ఆప్షన్‌ను తీసివేశారే తప్ప నియామకాల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. పాకిస్తాన్‌లోని చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎరిక్‌ లాంటివారే స్వీపర్లు, సీవర్‌ క్లీనర్లుగా ఉంటారు. ఒట్టి చేతులతోనే వారు మురికి కాలువలు, పైపులు, అందులోకి వచ్చే ఆస్పత్రి, పరిశ్రమల వ్యర్థాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకు వారికి చెల్లించే మొత్తం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఎరిక్‌కు మూడు కాల్వలు శుభ్రం చేసినందుకు అందిన మొత్తం కేవలం 6 డాలర్లు. 

చదువుకోలేదు... అందుకే వాళ్లను ఇలా
ఈ విషయం గురించి మాజీ ఎంపీ, స్వీపర్‌ ఆర్‌ సూపర్‌హీరోస్‌ అడ్వకసీ గ్రూపును నడుపుతున్న మేరీ జేమ్స్‌ గిల్‌ మాట్లాడుతూ.. సీవేజ్‌ క్లీనింగ్‌ కోసం యంత్రాలు అందుబాటులోకి తీసుకు రావాలని తాను ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. అయితే పారిశుధ్య కార్మికుల్లో చాలా మంది నిరక్షరాస్యులని, కాబట్టి ప్రభుత్వ అధికారులు వారిని సులభంగా ఒప్పించి మురికికూపంలోకి దింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సదుపాయాలు కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల వారంతా చర్మ, శ్వాసకోశ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధమవుతున్నారని.. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు. 

ఇక దాదాపు 20 కోట్ల మంది జనాభా ఉన్న పాకిస్తాన్‌లో సుమారు 80 శాతం పారిశుద్ధ్య కార్మిక పోస్టుల్లో మైనార్టీలనే నియమిస్తున్నారని.. వారి పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తోంది. ఏదేమైనా తమ లాంటి కార్మికులకు ఆరోగ్య భద్రత లేదని, రోగం బారిన పడి ఆస్పత్రికి వెళ్తే తమను చూసి కొంతమంది డాక్టర్లు లోపలికి కూడా అనుమతించరని.. తమ జీవితాలు ఇలాగే ముగిసిపోతాయంటూ మరో కార్మికుడు తమకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పంచుకున్నాడు’’ అని ఈ మేరకు కథనం వెలువరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement