‘ఉన్న రాష్ట్రాలే సరిగా లేవు.. ఇక కశ్మీర్‌ ఎందుకు’ | Shahid Afridi Controversy Comments On Kashmir | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 14 2018 4:52 PM | Last Updated on Wed, Nov 14 2018 5:03 PM

Shahid Afridi Controversy Comments On Kashmir - Sakshi

ఫైల్‌ ఫోటో

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది కశ్మీర్‌ అంశంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా తన దేశం అనుసరిస్తున్న విధానాలపైనా నిప్పులు చెరిగాడు. తమ నాయకులు ఉన్న నాలుగు రాష్ట్రాలనే సరిగా పాలించలేకపోతున్నారని, ఇక పాకిస్తాన్‌కు కశ్మీర్‌ ఎందుకని ప్రశ్నించాడు. ఇక అదేవిధంగా కశ్మీర్‌ను భారత్‌కు కూడా అప్పగించే ప్రసక్తే లేదని, కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశాడు. లోయలో అమాయక ప్రజలు చనిపోతున్నారని, మానవత్వంతో ఆలోచించి ఇరు దేశాలు నిర్ణయం తీసుకోవాలని సూచనలిచ్చాడు. (ఆఫ్రిదిపై మండిపడ్డ భారత క్రికెటర్లు)

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా ఆఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని విమర్శించడం విశేషం. పాక్‌ క్రికెట్‌ మాజీ సారథి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆఫ్రిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వివాదానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. (కశ్మీర్‌పై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు)

షాహిద్‌ ఆఫ్రిది కశ్మీర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారత అభిమానులతో సహా, మాజీ క్రికెటర్లు ఆఫ్రిదిపై విరుచుకుపడ్డారు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆఫ్రిది పాక్‌ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011 ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొన్న పాక్‌ జట్టుకు సారథిగాను వ్యవహరించాడు. (ఆఫ్రిదికి సచిన్‌ కౌంటర్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement