యాంగ్జీ నదీతీరం నుంచి ప్రమాద స్థలానికి వెళుతోన్న సహాయక బృందాలు
ఆసియా ఖండంలోనే అతి పొడవైన నదిగా పేరొందిన చైనాలోని యాంగ్జీ నదిలో ఘోర నౌకా ప్రమాదం జరిగింది. ఈస్టన్ స్టార్ అనే నౌక పెను తుఫానులో చిక్కుకొని మునిగిపోవడంతో అందులో ప్రయాణిస్తోన్న 450 మంది గల్లంతయ్యారు. సోమవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
దక్షిణ చైనాలోని నింజింగ్ నుంచి చోంక్వింగ్ కు బయలుదేరిన నౌకకు ప్రయాణం మధ్యలో ప్రతికూల వాతావరణం ఎదురైంది. తీవ్ర తుఫాను, పెనుగాలులు తాకిడికిగురై నీటిలో మునిగిపోయిందని, ప్రమాద స్థలికి చేరుకున్న సహాయ బృందాలు కెప్టెన్, చీఫ్ ఇంజనీర్ సహా కేవలం ఎనిమిది మందిని మాత్రమే కాపాడగలిగామని చైనా నౌకా దళం అధికారులు చెప్పారు. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశామన్నారు.
గల్లంతైనవారిలో 405 ప్రయాణికులు, 47 మంది నౌకా సిబ్బంది, ఐదుగురు ట్రావెల్ ఏజెన్సీకి చెందినవారు ఉన్నట్లు చైనా అధికారిక మీడియా జిన్హువా పేర్కొంది.ప్రస్తుతానికి కూడా తుఫాను తీవ్రత తగ్గక పోవడంతో సహాయ కార్యక్రమాలు మందకోడిగా సాగుతున్నాయి. చైనా ప్రీమియర్ లీ కెక్వింగ్.. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.