
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడింది. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అసలేమైందంటే..
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం, ఆపై ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో చాలామంది అమెరికన్లు విసిగిపోతున్నారు. గోల్ఫ్ క్లబ్‌లో అధిక సమయం గడుపుతారని ఆయనపై విమర్శలున్నాయి. వర్జీనియాలోని తన నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో గడపటం అలవాటుగా చేసుకున్న ట్రంప్.. గత నెలలో తన కాన్వాయ్‌లో గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న బ్రిస్క్‌మ్యాన్ అనే 50 ఏళ్ల మహిళ అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తోంది.
ఆ కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే తన ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపింది. దీంతో అమెరికా మొత్తం ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె నిజమైన దేశ భక్తురాలంటూ పలువురు సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. కాగా, బ్రిస్క్‌మ్యాన్ చేసిన చర్య వల్ల తమ సంస్థకు చెడ్డపేరొస్తుందని యాజమాన్యం భావించింది. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా తమ పేరు దెబ్బతినకూదని భావించిన అకీమా అనే కాంట్రాక్టర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయగా.. మరో ఉద్యోగం కోసం బ్రిస్క్‌మ్యాన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment