వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు అసభ్య సంకేతం చూపించినకారణంగా ఓ మహిళ ఉద్యోగం ఊడిన విషయం తెలిసిందే. ఏకంగా దేశాధినేతతో అలా ప్రవర్తిస్తావా అంటూ చివాట్లు పెట్టిన కంపెనీ ఆమెను విధుల నుంచి తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆమెపై వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ లక్ష్యంగానే పదే పదే మధ్య వేలు చూపించానంటోన్న బ్రిస్క్‌మ్యాన్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు.
కావాలనే అలా చేశాను
'గత అక్టోబర్ 28న తన కాన్వాయ్‌లో ట్రంప్ గోల్ఫ్ కోర్సుకు వెళ్తున్నారు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నేను అదే సమయంలో ఆ దారిలో సైకిల్‌పై వెళ్తున్నాను. కాన్వాయ్‌ని దాటుతున్న సమయంలో ట్రంప్ వాహనాన్ని చేరుకోగానే నా ఎడమచేతి మధ్యవేలిని చూపిస్తూ అధ్యక్షుడికి అసభ్య సంకేతాలు పంపించాను. ఎందుకంటే.. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో నా రక్తం మరిగిపోతోంది. ముఖ్యంగా కొన్ని రోజుల ముందు హెల్త్ పాలసీ, తదితర కీలకాంశాల్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చిరాకు తెప్పించాయి. ఆరోజు ట్రంప్ గోల్ఫ్ కోర్టుకు వస్తారని తెలిసి ఆ దారిలో ఎదురుచూశాను. సరైన సమయంలో నా నిరసనను అలా తెలిపాను. అయితే మీడియాతో పాటు వైట్‌హౌస్ బ్యూరో చీఫ్ స్టీవ్ హెర్మాన్ 'నేను వేలు చూపిస్తున్న ఫొటోను' సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నాపేరు మార్మోగిపోయింది. గోల్ఫ్ కోర్టుకు వెళ్లినప్పుడల్లా దీని గురించి అందరూ చర్చించుకోవాలి.
రెండ్రోజుల తర్వాత నా ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో ఆ ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా అప్‌డేట్ చేశాను. ఆ తర్వాత వివాదం పెద్దదవుతుందని భావించి జాతీయ మానవహక్కుల సంస్థకు వెళ్లి ఓ ఉద్యోగిని కలిశాను. ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా వేలు చూపించిన మహిళ ఎవరో తెలుసా అని అడిగాను. తెలియదని వారు చెప్పగా.. మీరు వెతుకుతున్న ఆ మహిళను నేనేనంటూ వెల్లడించాను. అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టులు తమకు రావన్న భయంతో అకీమా అనే కాంట్రాక్టర్ తన వద్ద ఆరునెలలుగా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్న నన్ను రాజీనామా చేయాలన్నారు. చేసేదేంలేక జాబ్ వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను. సోషల్ మీడియాలో తన చర్యను అందరూ మెచ్చుకుంటున్నారని, ట్రంప్ పాలనపై వ్యతిరేకత ఉందనడానికి ఇది నిదర్శనమని' బాధితురాలు బ్రిస్క్‌మ్యాన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment