మతాచారం కంటే మానవత్వమే మిన్నగా..
ఆక్లాండ్: మత ఆచారాన్ని సైతం పక్కన పెట్టి ఒక బాలుడి ప్రాణాలు కాపాడిన 22 ఏళ్ల హర్మన్ సింగ్ హీరో అయ్యాడు. అతని మత ఆచారాన్ని మించిన మానవత్వానికి అందరూ జై జైలు కొడుతున్నారు.
హర్మన్ సింగ్ న్యూజిలాండ్ లో అక్లాండ్ లో నివాసం ఉంటున్నాడు.. అదే ప్రాంతంలో ఐదేళ్ల బాలుడు తన సోదరితో స్కూలుకి బయలుదేరాడు. మార్గమధ్యలో ఒక కారు ఆ బాలున్ని ఢీకొంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంలోనే ఉన్న హర్మన్ సింగ్ వెంటనే అక్కడకి వెళ్లాడు. బాలుడికి తలనుంచి రక్తస్రావం అవ్వడం గమనించిన సింగ్ ఇంకో ఆలోచన లేకుండానే తన తల పాగాని తీసి బాలుడికి గాయమైన ప్రాంతంలో గట్టిగా కట్టాడు. తీవ్ర గాయాలతో అసుపత్రిలో చేరిన ఆ బాలుడి పరిస్థితి మొదట క్లిష్టంగా ఉన్న ప్రస్తుతం నిలకడగానే ఉంది.
'సిక్కు మత ఆచారం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో తల పాగాని తీయడం క్షమించరాని నేరం. నాకు తలపాగా మీద అపారమైన భక్తి ఉంది. కానీ ఆ సమయంలో మత ఆచారం గురించి ఆలోచించలేదు. ఆ ప్రమాదంలో గాయలతో కొట్టుమిట్టాడుతున్న ఆ బాలున్ని రక్షించడమే నా కర్తవ్యంగా భావించాను' అని సింగ్ అన్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇదంతా గమనించిన గగన్ దిల్లాన్ అనే వ్యక్తి ఫోటో తీసి ఫేస్ బుక్లో పోస్టు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకొచ్చింది. పోస్టు చేసిన తక్కువ వ్యవధిలోనే హర్మన్ సింగ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పోటెత్తాయి.