
ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి, ప్రముఖులు, సెలబ్రిటీలు నివాళులర్పించారు. మౌనమునిగా కనిపించే గొప్ప రాజనీతిజ్ఞుడు. తానెంటనేది చేతల ద్వారానే చూపించే గొప్ప దార్శనికుడు. రెచ్చగొట్టే వ్యాఖ్యలను, విమర్శలను చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తూ..తన విలువేంటో చాటిచెప్పేవారు. అంతేగాదు తాను కూల్‌గా కనిపించినా..టైం వస్తే ఎలా దూకుడుగా వ్యవహరిస్తానో తాను తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో దేశానికి తెలిసొచ్చేలా చేశారు.
అంతటి మహనీయుడు ఈ రోజు మన కళ్లముందు లేకపోయినా..ఆయన వదిలిన కొన్ని మధురమైన మాటలు, గడ్డు పరిస్థితుల్లో వ్యవహరించాల్సిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. అలాగే మన్మోహన్ వ్యవహార శైలికి తగ్గట్టుగానే ఆయన ఆహార్యం ఉంటుంది. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంటుంది. బహుశా ఈ స్టైల్‌తోనే ప్రత్యర్థులను మారుమాట్లడనీయకుండా తన మాటే శాసనమయ్యేలా చేసేవారిని చెబుతుంటారు అంతరంగికులు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ దుస్తుల వార్డ్‌రోబ్ గురించి తెలుసుకుందామా..!
రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలిసిక్కుగా ఘనత దక్కించుకున్న మృదుస్వభావి మన్మోహన్ సింగ్(Manmohan Singh). ఆయన ఎక్కువగా తెల్లటి కుర్తా, నెహ్రూ మాదిరి జాకెట్లు , నీలిరంగు తలపాగతో కనిపించేవారు. ఈ వేషధారణ తాను కార్యచరణకు, ప్రగతికి పెద్దపీట వేసే వ్యక్తి అని చెప్పకనే చెబుతోంది. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహిలియాన్ ప్రధాని ధరించి దుస్తులు దేశాన్ని నడిపించే బాధ్యతయుతమైన పనిలో ఉన్న వ్యక్తి ఆహార్యానికి అద్దంపట్టేలా ఉంటాయని అన్నారు.
మన దేశ సంస్కృతిని తెలియజెప్పేలా ఆయన ధరించే నీలిరంగు తలపాగ(sky-blue turbans), తెల్లటి కుర్తా పైజామాలు ఉంటాయని ప్రశంసించారు. అంతేగాదు మాజీ ప్రధాని మన్మోహన్ ఆధునాతనంగా కనిపించేలా గౌరవప్రదమైన డ్రెస్సింగ్‌ని ఎంచుకుంటారని చెప్పారు. ప్రశాంతంగా కనిపించే తన వ్యవహారశైలికి సరిపోలిన డ్రెస్సింగ్ స్టైల్ అని అభిర్ణించారు డిజైనర్ తరుణ్.
అంతేగాదు ఆయన ధరించే నీలిరంగు తలపాగా మన్మోహన్ ట్రేడ్‌మార్క్ అని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ(University of Cambridge)లో చదివిన నేపథ్యం తనలో అంతర్భాగమని తెలియజేప్పేలా ఆయన ఇలా ఎక్కువగా నీలి ఆకాశం రంగులోని తలపాగను ధరించేవారని సన్నిహితులు చెబుతుంటారు.
ఒకరకంగా చెప్పాలంటే ఈ విధమైన రంగుల కలయికతో కూడిన దుస్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి సంకేతమని, పైగా సానుకూలంగా వ్యవహారం చక్కబెట్టుకునేలా చేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు, నమ్రతతో, రిజర్వ్‌గా ఉంటే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి డ్రెస్సింగ్ స్టైల్‌నే ఎంచుకుంటారని అన్నారు.
(చదవండి: యువ 'కలం'..! ట్రెండ్ సెట్టర్స్‌గా యంగ్ రైటర్స్)