
సింగపూర్ : కరోనాను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ను జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని దేశ ప్రధాని లీ హ్సేన్ లూంగ్ మంగళవారం మీడియా ముఖంగా ప్రకటించారు. తొలుత మే నాలుగు వరకు లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండటం వల్ల మరో నాలుగు వారాల వరకు పొడిగింపు తప్పలేదని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియా, చైనా నుంచి సింగపూర్‌కు వచ్చిన అనేక మంది వలస కార్మికుల వల్లే దేశంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. (డాక్టర్‌ను బలితీసుకున్న కరోనా)
మరోవైపు వలస కార్మికుల ద్వారా కొత్తగా 1111 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కేసులతో కలుపుకుని సింగపూర్‌లో ఇప్పటివరకు 9125 కేసులు నమోదదవగా 11 మంది మరణించారు. ఇదిలావుండగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 25 లక్షలకు చేరువలో ఉండగా లక్షా డెబ్భైవేలకు పైగా మరణించారు. ఆరున్నర లక్షల మంది ఆ ప్రాణాంతక వైరస్ నుంచి కోలుకున్నారు. (కరోనా కరోనా అంటూ అరుస్తూ..)