ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫీసుల్లో నెట్ కట్!
సింగపూర్: తమ దేశ ప్రభుత్వ ఉద్యోగులకు సింగపూర్ ప్రభుత్వం షాకిచ్చింది. సెక్యూరిటీ పేరుతో ఆఫీసుల్లోని తమ కంప్యూటర్లకు నెట్ కనెక్షన్ కట్ చేయనుంది. దీంతో ప్రతి అంశానికి ఇక ఏ ఉద్యోగి కూడా గూగుల్లో విహరించే అవకాశం ఉండకపోవచ్చు. దీంతో దాదాపు ఒక లక్ష కంప్యూటర్లు ఇక నెట్ లేకుండా కేవలం ఉద్దేశించిన పని నిమిత్తమై పనిచేయనున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖలకు దీనికి సంబంధించిన సమాచారం పంపించారు కూడా. సైబర్ చోరీలు ఎక్కువవుతుండటంతోపాటు హ్యాక్ సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెట్ కనెక్షన్ ఇవ్వకూడదని సింగపూర్ ప్రభుత్వం భావించిందట.
అయితే, ఎంపిక చేసిన కొద్దిమంది ప్రభుత్వాధికారులకు మాత్రం ఈ సౌకర్యం ఉండనుంది. 'మన దేశ నెట్ వర్క్ ను భద్రంగా ఉంచే ఉద్దేశంతో ఇప్పటి వరకు ప్రతి రోజు నిర్వహించిన సమీక్షలు, ఐటీ ప్రమాణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది' అని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. 'మేం ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం నెట్ కనెక్షన్ సౌకర్యం ఇచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేస్తున్నాం. మరో ఏడాదిలో ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం ఉండబోదు' అని వారు ఆ ప్రకటనల్లో తెలిపారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే సామర్థ్యం, ఉత్పాదకత పెంచేందుకు, రక్షణతో కూడిన నెట్ వ్యవస్థ కోసం సింగపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.