ఏక చక్రం.. వాలు వేగం
ఫొటో చూసి.. ఇదేదో సర్కస్ ఫీట్ ఏమో అని అనుకునేరు. కానే కాదు. ఇది అక్షరాల మన రోడ్లమీద పరుగెత్తగల మోటర్‌సైకిలే? పేరు ఊనోబోల్ట్. బోలెడన్ని విశేషాలున్నాయి దీంట్లో. అన్నింటి కంటే ముందుగా చెప్పుకోవాల్సింది దీని ఒంటి కాలి గురించి! సర్కస్‌లో ఒంటిచక్రం సైకిళ్లను పోలినప్పటికీ పడిపోకుండా దీనిని నడపాలంటే మనం పెద్దగా కష్టపడనవసరం లేదు. దీంట్లో ఉండే జైరోస్కోపులు.. సెన్సర్లు ఎప్పటికప్పుడు మోటార్‌సైకిల్ ఎలా ఉందన్న విషయాన్ని గమనిస్తూ.. బరువును అటుఇటూ మారుస్తూ నిలకడగా. నిట్టనిలువుగా ఉంచుతాయి. రెండో విశేషం.. మీరు అనుకుంటున్నట్లే.. ఇది పూర్తిగా విద్యుత్తుతో మాత్రమే పనిచేసే మోటార్‌సైకిల్. ఒకసారి చార్జ్ చేస్తే 4.4 ఆంపియర్ అవర్స్ బ్యాటరీ సాయంతో దాదాపు 40 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లవచ్చు. ఛార్జ్ చేసేందుకు పట్టే సమయం దాదాపు 45 నిమిషాలు మాత్రమే. అరవై వోల్టులు, వెయ్యి వాట్ల విద్యుత్తు మోటార్ చక్రం మధ్యలోనే ఉంటుంది.
కేవలం ఇరవై కేజీల బరువు మాత్రమే ఉన్నప్పటికీ దీనిపై దాదాపు 127 కిలోల బరువున్న వాళ్లూ సులువుగా ప్రయాణించవచ్చు. కొన్నేళ్ల క్రితం వచ్చిన సెగవే పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనం మాదిరిగానే దీంట్లో ప్రత్యేకంగా యాక్సలరేటర్ లాంటిదేమీ ఉండదు. హ్యాండిల్ బార్‌ను పట్టుకుని మనం కాస్త ముందుకు వాలితే వేగం అందుకుంటుంది. వెనక్కు వాలితే నెమ్మదిస్తుంది. బ్రేక్‌ను నొక్కితే ఆగిపోతుంది. పక్కలకు తిరగాలంటే.. ఆ వైపునకు కొంచెం వాలితే సరిపోతుంది. ఇంకో విషయం.. ఈ మోటార్‌సైకిల్‌లో రివర్స్ గేర్ కూడా ఉందండోయ్! ఊనోబోల్ట్ పేరుతోనే కంపెనీ ఏర్పాటు చేసిన కొంతమంది ఔత్సాహికవేత్తలు ప్రస్తుతం ఈ ఒంటికాలి మోటార్‌సైకిల్‌ను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు కిక్‌స్టార్టర్ వెబ్‌సైట్ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ప్రచారం మొదలుపెట్టి కొన్ని రోజులు కూడా కాలేదుగానీ.. ఇప్పటికే వారు లక్ష్యానికి మించి డబ్బులు సేకరించగలిగారు. అన్నీ సవ్యంగా సాగితే.. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఊనోబోల్ట్‌లు రోడ్లపైకి వస్తాయని అంటున్నారు ఈ ఇటలీ కంపెనీ సీఈవో సీన్ ఛాన్!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్