పాముల ముత్తాతలకు నాలుగుకాళ్లు!
న్యూయార్క్: పాములకు కాళ్లుండటమేంటి? నాన్‌సెన్స్ అని కొట్టిపారేయకండి. యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ శాస్త్రవేత్తలకు ఈ మేరకు ఆధారాలు కూడా లభించాయి. ఇటీవల బ్రెజిల్‌లో జరిపిన తవ్వకాల్లో నాలుగుకాళ్లతో ఉన్న శిలాజం లభించింది. దీనిపేరు టెట్రాపోడిస్ ఆంప్లికీటస్. ఇది 14-11 కోట్ల ఏళ్ల క్రితం జీవించిందని పరిశోధకులు చెబుతున్నారు. దీని బాహ్య, జన్యులక్షణాలను విశ్లేషించగా ప్రస్తుతం ఉన్న పాములకు ఎంతో సారూప్యత ఉందని పేర్కొన్నారు. ఈ శిలాజం ఆధారంగా పాములు, ఉడుములకు మధ్య ఇంతకాలం తెగిపోయిన సంబంధం గుట్టు తెలిసిందని వెల్లడించారు.
పరిణామ క్రమంలో టెట్రాపోడిస్ నుంచి ప్రస్తుతం ఉన్న పాములు, ఉడుములు ఉద్భవించాయని వివరించారు. అండాకరపు శరీరం, పొడవైన మెడ, శరీరంపై పొలుసులు, కోరదంతాలు, పొడవైన జీవులను మింగేందుకు వీలుగా ఉండే దవడలను బట్టి ఇది మాంసాహారి అని నిర్ధరించారు. జీవనశైలి, శరీర నిర్మాణం, ఆహారసేకరణలో పాములతో అనేక సారూప్యతలు కలిగిఉంది. ఒక్క చలనంలోనే వ్యత్యాసం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శిలాజం శరీర నిర్మాణం ఆధారంగా పాములు నీటిజీవుల నుంచి ఉద్భవించలేదని స్పష్టం చేస్తుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన డేవిడ్ మార్టిల్ పేర్కొన్నారు.