
కొండ అంచున మంచులో వేలాడుతున్న స్కేట్ బోర్డర్
కెనడా : స్కేటింగ్ సరదా ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. దాదాపు 2గంటల పాటు చావు అంచుల మీద నిలబడేలా చేసింది. ఈ సంఘటన కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొన్ని వారాల క్రితం ఓ వ్యక్తి స్నోస్కేటింగ్ చేయడానికి కెనడాలోని బ్లాక్‌కోమ్బ్ స్కై రిసార్ట్‌కు వెళ్లాడు. మంచులో స్కేటింగ్ చేస్తూ గడపసాగాడు. ఈ నేపథ్యంలో పట్టుతప్పి మంచులోయలోకి జారాడు. కొంచెం ఉంటే లోయలోపల పడేవాడే. కానీ, మెల్లగా జారుతూ కిందకు రావటం వల్ల మంచుతో కప్పబడిన చిన్న కొండ అంచు అతడికి ఆసరాగా మారింది. అయితే కాళ్లు స్కేటింగ్ బోర్డుకు బంధించి ఉండటం వల్ల మరో ప్రమాదం ఎదురైంది. అతడి కాళ్ల కింద ఉన్న మంచు కొద్దికొద్దిగా జారటం ప్రారంభమైంది.
అలా కొండ అంచున ప్రాణాలకోసం పోరాటం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపాడు. కొద్ది సేపటి తర్వాత అటువైపు వచ్చిన కొంతమంది అతని పరిస్థితిని గమనించి.. స్కై పాట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న స్కై పాట్రోల్ సిబ్బంది అతడ్ని క్షేమంగా కిందకు దించారు. ఈ సంఘటనలో అతడికి ఎలాంటి గాయాలు కాకపోవటం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment