'మా వాళ్లకు నిద్ర లేకుండా డిస్ట్రబ్ చేస్తోంది'
స్టాక్హోమ్: స్వీడన్ దేశ భావితరాన్ని సోషల్ మీడియా పట్టి పీడిస్తోందట. వారిని సరిగా నిద్రకూడా పోనివ్వడం లేదట. డిజిటల్ డివైస్లను ఉపయోగించడం మూలంగా స్వీడన్ దేశ పిల్లలు, యువకులు నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా సోషల్ మీడియానే ఆ డివైస్ను ఉపయోగించడానికి ప్రధాన కారణం అని స్వీడన్కు చెందిన పబ్లిక్ బ్రాడ్కాస్టర్ టెలివిజన్ తెలిపింది. నిద్రపోవడానికి ముందు ఆ దేశంలో 82శాతంమంది డిజిటల్ డివైస్లను ఉపయోగిస్తూ వారికి నిద్రలేకుండా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
ఏ పనిని సమర్థంగా చేయాలన్నా మెదడుకు విశ్రాంతి చాలా అవసరం అని, అది కేవలం నిద్ర ద్వారానే సాధ్యం అవుతుందని, ఈ విషయం మరిచిపోయిన యువకులు, చిన్నారులు అనవసరంగా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో తలదూరుస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా వీరంతా కూడా 15 నుంచి 29 ఏళ్లలోపు వారే కావడంతో ఓ రకంగా తమ దేశానికి ఆందోళన కలిగించే విషయం అని వెల్లడించింది. అంతేకాకుండా ఐదేళ్లకిందట ఎంతబాగా నిద్రపోయామో ఇప్పుడలా నిద్రపోలేకపోతున్నామని కూడా సగంమంది యువకులు ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. దీనంతటికి సోషల్ మీడియానే ప్రధాన కారణం అని కూడా వారు చెప్పినట్లు పేర్కొంది.