ప్రపంచ యాత్రకు సోలార్ బోట్ రెడీ
సెయింట్–మాలో(ఫ్రాన్స్): సోలార్ ఇంపల్స్.. పేరు గుర్తుండే ఉంటుంది. ... అవును ఇంధనం సాయం లేకుండా కేవలం సూర్యరశ్మి సాయంతో ఇటీవలే ప్రపంచాన్ని చుట్టివచ్చిన సోలార్ విమానం. ఈ ప్రయాణం విజయవంతం కావడంతో ఔత్సాహికుల దృష్టి ఇప్పుడు సోలార్ బోట్‌పై పడింది. దీంతో సోలార్ బోట్‌ను తయారుచేసి, దానిపై ప్రపంచాన్ని చుట్టిరావాలనేది వీరి లక్ష్యం. సంప్రాదాయేతర ఇంధన వనరుల(సూర్యరశ్మి, హైడ్రోజన్) సాయంతో నడిచే బోటును కూడా సిద్ధం చేస్తున్నారు పశ్చిమ ఫ్రాన్స్‌కు చెందిన కొందరు ఔత్సాహికులు.
సోలార్ విమానంలా కేవలం సూర్యరశ్మితో మాత్రమే కాకుండా సముద్ర జలాల్లోని హైడ్రోజన్, ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని నడిచేలా దీన్ని రూపొందిస్తున్నామని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రముఖ స్క్యూబా డైవర్ విక్టోరియన్ ఎరుస్సార్డ్ తెలిపారు. ఇది సిద్ధమైతే ప్రపంచంలోనే తనంతట తానుగా ఇంధనాన్ని తయారు చేసుకునే తొలి బోట్‌గా చరిత్ర సృష్టిస్తుందని, అలుపెరుగని ప్రయాణాలకు నాంది పలుకుతుందని దీని తయారీదారులు చెబుతున్నారు.