సైనికుడా.. సలాం..
కుండపోత.. వరద.. డ్యామ్‌కు గండి.. గండిని పూడ్చాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది.. ఇంతలో వరద నీరు వేలాది ఎకరాలను, గ్రామాలను ముంచేస్తుంది.. వేలాది మంది ప్రాణాలకు ప్రమాదం.. ఏం చేయాలి? ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు.. తమ ప్రాణాలకు ప్రమాదమని తెలిసీ లెక్కచేయలేదు.. 16 మంది వీర సైనికులు వరదకు అడ్డుకట్ట వేశారు.. ఆనకట్టలాగ నిలుచున్నారు.. 6 వేల మంది ప్రాణాలను, వేలాది ఎకరాలను ముంపు నుంచి కాపాడారు. ఈ ఘటన చైనాలోని జూజియాంగ్‌లో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అక్కడి డ్యామ్‌కు గండిపడింది. విషయం తెలిసిన సైనికులు అక్కడికి చేరుకున్నారు. ఇసుక బస్తాలు వేసి దాన్ని రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది.
ఇంతలో వరద నీరు ఊళ్లను ముంచెత్తుంది ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో 16 మంది సైనికులు కొన్ని ఇసుకబస్తాలు ముందు వేసి.. వాటి వెనుక మానవ డ్యామ్ తరహాలో నిల్చున్నారు. ఇలా వీరు దాదాపు 6 గంటలపాటు.. గండి పూడ్చే పని పూర్తయ్యేవరకూ అక్కడే నిల్చున్నారు. సైనికుల సాహసోపేత చర్యపై సర్వత్రా అభినందనల వర్షం కురిసింది. ధీరోదాత్తులైన ఈ సైనికులు ఉన్నారు కాబట్టే.. ఈ రోజు నాపంట, నా ప్రాణం నిలిచాయి అని అక్కడి రైతన్నలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. సైనికుడా.. సలాం..