పాస్‌వర్డులను కాప్సుల్లా మింగేయొచ్చు!
ఇంటర్నెట్‌లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్‌ల పద్ధతి ఇక పాతబడిన విద్యే. మన కంప్యూటర్ మనల్ని గుర్తించేందుకు మన శరీరంలోనే పాస్‌వర్డ్‌లు దాగి ఉంటాయనేది రేపటి సాంకేతిక పరిణామం. ఆన్‌లైన్ చెల్లింపుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 'పేపాల్' ఈ దిశగా కసరత్తును ప్రారంభించింది. కాప్సుల్స్ రూపంలో పాస్‌వర్డ్‌లను, ఇతర మైక్రోచిప్‌లను మింగేసే టెక్నాలజీపై పేపాల్‌కు చెందిన డెవలపర్ జొనాథన్ లెబ్లాంక్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. ఈదిశగా ఇప్పటికే ఆయనెంతో విజయం సాధించారు. ఆయన ఇటీవల తన ప్రయోగాలపై 'కిల్ ఆల్ పాస్‌వర్డ్స్' పేరిట ఓ ప్రయోగాత్మక ప్రదర్శన ఇచ్చినట్టు 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తెలియజేసింది.
ఆయన చర్మం కింద మైక్రోచిప్‌లు, మైక్రోఫోన్స్ అమర్చుకొని వాటి పనితీరును ప్రదర్శించి చూపారు. కాప్సుల్ రూపంలో తయారుచేసిన పాస్‌వర్డ్, నానోచిప్స్ కలిగిన పరికరాన్ని చూపించారు. ఆ క్యాప్సుల్‌ను మింగేస్తే చాలట. అది మన శరీరంలో భాగమవుతుంది. శరీరంలో అంతర్భాగమైన పాస్‌వర్డ్‌ను కంప్యూటర్ గుర్తిస్తుంది. బ్రెయిన్‌లో కూడా కంప్యూటర్ చిప్స్‌ను అమర్చుకోవచ్చని, వాటిని పాస్‌వర్డ్‌ల కోసమే కాకుండా ఇతర కంప్యూటర్ అవసరాల కోసం, డేటా స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఇంజెక్షన్ ద్వారా కూడా పాస్‌వర్డ్‌లను మానవ శరీరంలో భద్రపర్చుకోవచ్చని ఆయన తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, సాంకేతిక పరికరాలను మింగేయొచ్చని, శరీరంలోని రక్తంలో, నరాలతో వాటిని మిళితం చేయొచ్చని లెబ్లాంక్ వివరించారు. ఓ మనిషి గుర్తింపునకు ఆ మనిషి బొటన వేలు ముద్రలు, ఐరిస్ లాంటి బయోమెట్రిక్ పద్ధతులు ఇక పాతబడినవేనని, మన శరీరంలో కలిసిపోయిన పాస్‌వర్డ్‌లే మన గుర్తింపునకు దోహదపడతాయని వివరించారు. ఇంటర్నెట్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారు సగటున 16 పాస్‌వర్డ్‌లు గుర్తించుకోవాల్సి వస్తుందని, అన్నింటిని గుర్తించలేక సతమతమవుతున్న వారు కూడా ఎక్కువమందే ఉన్నారని, వారి సౌకర్యార్థం ఈ కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టినట్టు 'పేపాల్' సంస్థ పేర్కొంది. అయితే మానవ శరీరంలో కలిసిపోయే ఈ సరికొత్త పరికరాలను ఇప్పుడే అందుబాటులోకి తీసుకరావాలనే ఉద్దేశం తమ కంపెనీకి లేదని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయోగాలు నిర్వహిస్తున్నామని లెబ్లాంక్ వివరించారు.