న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) మరోసారి రహస్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకు కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్.. భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి గతంలో లేఖ రాశారు. అదే విధంగా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా చైనాను కోరారు.
ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో చైనా ఒత్తిడి మేరకు యూఎన్‌ఎస్‌సీ రహస్య సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఐరాసలో శాశ్వత సభ్యత్వం లేనందున పాక్‌కు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించలేదు. దీంతో తాజాగా చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని మరోసారి యూఎన్‌ఎస్‌సీలో చర్చించేలా పాక్ పావులు కదిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ ఇదివరకే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్‌లు భారత్‌ను సమర్థించగా.. కేవలం చైనా మాత్రమే పాక్‌కు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment