కబళిం‘చైనా’..!
సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొని దాదాపు 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమంటూ భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో సఫలమైంది.
తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమించడం, తర్వాత అది తమ అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం...ఇది చైనాకు పరిపాటిగా మారింది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా వివాదాస్పద భూభాగంగా మారిపోతోంది. చిలక్కొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరించడం చైనా అనుసరించే మరో పద్ధతి. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ చైనా దురాక్రమణలను వివరించేదే ఈ కథనం.
టిబెట్‌తో మొదలు...
మావో జెడాంగ్ నేతృత్వంలో సీపీసీ అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే చైనా విస్తరణపై దృష్టి పెట్టింది. బౌద్ధమతగురువుల పాలనలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్‌ను బలవంతంగా ఆక్రమించి 12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమలో కలిపేసుకుంది. టిబెట్ పీఠభూమికి పశ్చిమాన ఉన్న షిన్జియాంగ్ ప్రాంతాన్ని కూడా కలిపేసుకుంది. 12 లక్షల చదరపు కిలోమీటర్ల టిబెట్, 16.64 లక్షల చదరపు కిలోమీటర్ల షిన్జియాంగ్ కలవడంతో చైనా భూభాగం ఏడాదిలోపే రెట్టింపైంది.
అక్సాయ్ చిన్... హాంఫట్
1962లో అక్సాయ్‌చిన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు తమవేనంటూ భారత్‌తో చైనా యుద్ధానికి దిగింది. అరుణాచల్‌లో తవాంగ్‌ను ఆక్రమించినా యుద్ధం ముగిశాక తిరిగిచ్చింది. తవాంగ్ నుంచి వెనక్కితగ్గి మెక్‌మెహన్ రేఖను గౌరవిస్తున్నట్లు ప్రకటించిన చైనా...37,224 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అక్సాయ్‌చిన్‌ను మాత్రం తమ దేశంలో కలిపేసుకుంది. నిజానికి 1957లోనే చైనా అక్సాయ్‌చిన్‌లో రోడ్డును నిర్మించింది. మన నిఘావర్గాలు ఆలస్యంగా మేలుకొన్నాయి. నెహ్రూ ప్రభుత్వం దీన్ని చైనా వద్ద లేవనెత్తింది తప్పితే బహిరంగ పర్చలేదు. 1993లో కుదిరిన ఒప్పందంతో అక్సాయ్‌చిన్‌పై చైనా నియంత్రణను పరోక్షంగా అంగీకరిస్తూ వాస్తవాధీన రేఖను భారత్ గుర్తించింది.
దక్షిణ చైనా సముద్రంపై పేచీ...
సహజ వనరులు, అపార సహజవాయువు నిలువలున్న దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 80 శాతం తమ ప్రాదేశిక జలాలేనని చైనా వాదిస్తోంది. ఇతర దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం చైనా వాదనతో విభేదిస్తున్నాయి. చైనా ఇక్కడ కృత్రిమ దీవులను నిర్మించి సైనిక స్థావరాలుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని అమెరికా, జపాన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ దేశం. వీటన్నింటిలోనూ చైనా విస్తరణ కాంక్ష ప్రస్ఫుటమవుతోంది. కాబట్టి డోక్లామ్‌లో చైనాను అడ్డుకోవడం పొరుగునున్న భారత్‌కు ముఖ్యం.
దీవులపై డ్రాగన్ కన్ను...
ఆ తర్వాత చైనా వ్యూహాత్మకంగా కీలకమైన దీవులపై దృష్టి పెట్టింది. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో దీవులను వేర్వేరు దేశాల నుంచి లాగేసుకుంది. వియత్నాం అధీనంలోని పారాసెల్ దీవులను 1974లో, జాన్సన్ రీఫ్‌ను 1988లో, మిస్చీఫ్ రీఫ్‌ను 1995లో చేజిక్కించుకుంది. 2012లో ఫిలిప్పీన్స్ నుంచి స్కార్‌బొరో షోల్‌ను స్వాధీనం చేసుకుంది. వీటి సమీపంలోకి ఇతర దేశాల నౌకల రాకపోకలను నియంత్రించింది.
అయితే 2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకొని చైనా పంచన చేరడంతో ఇప్పుడు ఫిలిప్సిన్స్ మత్యకారులను అక్కడికి అనుమతిస్తున్నారు. అటు తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకూ దీవులు తమవేనంటూ వివాదం చేస్తోంది చైనా. ఈ దీవుల పరిసరాల్లో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. చమురు నిక్షేపాలు కూడా ఉన్నట్లు 1970లో కనుగొన్నారు. దాంతో చైనా కన్ను సెంకాకూ దీవులపై పడింది. అప్పటినుంచి ఏదో ఒక మిషతో సెంకాకూ దీవులను చైనా వివాదాస్పదమైనవిగా చూపే ప్రయత్నం చేస్తోంది.