Doklum
-
సరిహద్దుల్లో స్నేహగీతం..
వుహాన్: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసేందుకు ఇరు దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. భవిష్యత్తులో డోక్లాం తరహా సంఘటనలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య వుహాన్‌లో జరుగుతున్న అనధికారిక సదస్సు చివరిరోజైన శనివారం సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్–చైనా సరిహద్దులకు సంబంధించిన అన్ని అంశాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విభిన్న రంగాల్లో భారత్–చైనా సహకారంపై దృష్టిసారించామని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చే మార్గాలు, ప్రజల మధ్య సంబంధాల్ని పెంపొందించే అంశాలపై మేం చర్చించాం. వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాలపైనా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. భారత్, చైనాల మధ్య దృఢమైన స్నేహం రెండు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే లాభదాయకం’ అని ట్వీట్ చేశారు. మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు, ఇతర కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 గంటల పాటు కలిసి గడిపారని చైనా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. కాగా రెండ్రోజుల చైనా పర్యటన ముగించుకున్న మోదీ భారత్‌కు చేరుకున్నారు. గతేడాది 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం వివాదంతో దెబ్బతిన్న సంబంధాల్ని పునఃనిర్మించే దిశగా శనివారం మోదీ, జిన్‌పింగ్ చర్చలు కొనసాగాయి. ఇరువురి మధ్య అనధికారిక సమావేశం వివరాల్ని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడిస్తూ..‘సరిహద్దు అంశాల పరిష్కారంలో నమ్మకం, పరస్పర అవగాహన నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు సమాచార మార్పిడిని బలోపేతం చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే ఇరు వైపులా ఆమోదించిన నిర్ణయాల్ని నిజాయతీతో అమలు చేయాలని వారి సైన్యాలను రెండు దేశాల అధినేతలు నిర్దేశించారు’ అని చెప్పారు. సరిహద్దు అంశంలో సముచితం, అంగీకారయోగ్యం, పరస్పర ఆమోదనీయమైన ఒప్పందం కోసం పత్యేక ప్రతినిధుల ప్రయత్నాల్ని మోదీ, జిన్‌పింగ్‌లు ఆమోదించారని గోఖలే తెలిపారు. ఉగ్రవాద నిరోధంలో సహకరించుకుందాం.. ‘శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలకు తగిన పరిణతి, అవగాహన ఉందనే అభిప్రాయంతో ఇరువురు నేతలు ఏకీభవించారు. ఆందోళనలు, ఆకాంక్షలు, సున్నితమైన అంశాల్లో ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విషయాన్ని మోదీ, జిన్‌పింగ్‌లు గుర్తు చేసుకున్నారు. భారత్, చైనాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తులు ఇమిడి ఉన్నాయని, ఆ అంశాలపై విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మక చర్యల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని వారిద్దరు అంగీకరించారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే క్రమంలో ఆ సంప్రదింపులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ, జిన్‌పింగ్‌లు విశ్వసించారు’ అని గోఖలే తెలిపారు. ఉగ్రవాదంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ఇద్దరు నేతలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిష్పాక్షికంగా సాగాల్సిన అవసరంతో పాటు దానిని కొనసాగించాలని ఇరు నేతలు నొక్కిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంతో సాగాలని మోదీ అభిలషించారు. చైనాకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులకున్న అవకాశాల్ని ప్రధాని ప్రస్తావించారు’ అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చగల శక్తులుగా.. భారత్, చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగాల్సిన అవసరముందని, పరస్పర విశ్వాసం ఆధారంగా అభివృద్ధి కొనసాగాలని జిన్‌పింగ్ ఆకాక్షించారు. భేటీ వివరాల్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థజిన్హుహ వెల్లడిస్తూ ‘చైనా భారత్‌లు మంచి పొరుగు దేశాలే కాకుండా మిత్ర దేశాలు కూడా.. ప్రపంచాన్ని మార్చగల కీలక శక్తులుగా ఒకరినొకరు పరిగణించుకోవాలి. సానుకూల, న్యాయబద్ధమైన, కలుపుగోలు ప్రవర్తనను తప్పకుండా అలవరచుకోవాలి.అదే సమయంలో పరస్పర ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. భారత్, చైనాలు సన్నిహిత వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరముంది’ అని మోదీతో చైనా అధ్యక్షుడు తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరుదేశాలు మరింత పరిణతితో విభేదాల్ని పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సమన్వయం, సహకారం బలోపేతం చేసుకోవాలని.. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ కోసం కృషిచేయాలని జిన్‌పింగ్ సూచించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఇద్దరు నేతలు వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి, ఆహార భద్రత అంశాలపై కూడా చర్చించారు. చైనాలోని అతిపెద్ద నది యాంగ్జీ, భారత్‌లో అతిపెద్ద నది గంగా నదుల్ని పరిరక్షణలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య క్రీడల ప్రోత్సాహం, బౌద్ధ మతం కేంద్రంగా పర్యాటక అభివృద్ధిపై కూడా మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు జరిపారు. మోదీ, జిన్‌పింగ్ బోటు షికారు వుహాన్‌లోని సుందరమైన ఈస్ట్ లేక్ తీరం వెంట మోదీ, జిన్‌పింగ్‌లు శనివారం విహరించారు. తర్వాత బోటు షికారు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ‘ఈస్ట్ లేక్‌లో బోటు షికారు గుర్తుండిపోయేలా సాగింది’ అని మోదీ ట్వీట్ చేశారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు ఒకే బోటులో షికారు చేశారు అని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. దంగల్ బాగా నచ్చింది: జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా బాగా నచ్చిందట.. గతేడాది చైనాలో దాదాపు 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమాను చూసినట్లు మోదీతో జిన్‌పింగ్ చెప్పారు. గతంలో ఎన్నో భారతీయ సినిమాలు చూశానని, వాటిలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు ఉన్నాయని చైనా అధ్యక్షుడు చెప్పడం విశేషం. ‘మరిన్ని భారతీయ సినిమాలు చైనాలో, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శిస్తే బాగుంటుందని జిన్‌పింగ్ ఆకాంక్షించారు’ అని విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. శుక్రవారం తొలిరోజు భేటీ అనంతరం 1982ల నాటి బాలీవుడ్ సినిమా ‘యే వదా రహా’లోని ‘తు హై వహీ దిల్ నే జిసే అప్నా కహా..’ పాటను చైనా వాద్యకారులు వినిపించారు. వుహాన్‌లోని ఈస్ట్‌లేక్ వద్ద సంభాషించుకుంటున్న మోదీ, జిన్‌పింగ్ ఈస్ట్లేక్లోని బోటులో మోదీ, జిన్‌పింగ్ -
కౌగిలింతా? రాద్ధాంతమా?
న్యూఢిల్లీ/సాక్షి,బెంగళూరు: దక్షిణ డోక్లాం చేరుకోవడానికి చైనా కొత్త మార్గం తెరుస్తోందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యా స్త్రాలు సంధించారు. ఈ పరిణామాన్ని ప్రధాని ఎలా ఎదుర్కొంటారు?కౌగిలింత దౌత్యం తోనా? లేక రక్షణ మంత్రిని బాధ్యురాలిని చేస్తారా? అంటూ ట్వీట్ చేశారు. ‘డోక్లాంలో మళ్లీ చైనా జోరు పెరిగింది. ఈసారి మోదీ ఎలా స్పందిస్తారు? 1.కౌగిలింత దౌత్యం 2.రక్షణ మంత్రిని బాధ్యురాల్ని చేయడం 3. బహిరంగ విమర్శలు 4. పైవన్నీ’ అని పేర్కొన్నారు. గతంలో నానమ్మ ఇందిరా గాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆశీర్వదించాలని రాహుల్ గాంధీ ప్రజలను కోరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన చిక్కమగళూరులో పర్యటించారు. -
‘డోక్లామ్’ సవాలుకు సిద్ధం: భారత్
జమ్మూ: డోక్లామ్ ప్రతిష్టంభనకు సంబంధించి చైనా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తి సన్నద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మేరకు చేపడుతున్న చర్యల పట్ల భారత్ విశ్వాసంతో ఉందని చెప్పారు. ఈ మధ్య కాలంలో చైనా మీడియా నుంచి వెలువడుతున్న వరస ప్రకటనలను కొట్టిపారేశారు. సిక్కిం సెక్టార్లో భారత్ తన బలగాలను వెనక్కి పిలవాలని చైనా హెచ్చరించడంపై స్పందిస్తూ...‘మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎదుటి పక్షం నుంచి వస్తున్న ట్వీట్లపై మాట్లాడానికి ఇక్కడి రాలేదు. మా చర్యలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని అన్నారు. భారత్–పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘనకు భారత్ తగిన రీతిలో బదులిస్తోందని పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో యువత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని మిలిటెంట్ జకీర్ మూసా చిత్రంతో కూడిన పోస్టర్లు వెలుగుచూడటంపై మాట్లాడుతూ..అలాంటి పోస్టర్లు గతంలోనూ కనిపించాయని అన్నారు. ‘భారత్ పరిణతితో వ్యవహరిస్తోంది’ వాషింగ్టన్: డోక్లామ్‌పై భారత్ పూర్తి పరిణతితో, చైనా అసహనంతో వ్యవహరిస్తోందని అమెరికా రక్షణ నిపుణుడొకరు అభిప్రాయపడ్డారు. అమెరికా నేవీ కళాశాల ప్రొఫెసర్ హో మ్స్ స్పందిస్తూ వివాదాన్ని చైనా సుదీర్ఘకాలం కొనసాగించాలని కోరుకుంటోందన్నారు. -
చైనా సరిహద్దుల్లో పెరిగిన భారత బలగాలు
న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో ఉన్న సరిహద్దుల వెంట భారత్ తన బలగాల సంఖ్యను పెంచిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. డోక్లామ్‌లో పరిస్థితిని, చైనా దూకుడైన వైఖరిని సమగ్రంగా విశ్లేషించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బలగాల అప్రమత్తత స్థాయులను పెంచినట్లు పేర్కొన్నారు. తూర్పు భాగంలో సున్నితమైన భారత్–చైనా సరిహద్దులో... సుక్నా కేంద్రంగా పనిచేస్తున్న 33 కార్ప్స్, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 3,4 కార్ప్స్ దళాలను మోహరించినట్లు పేర్కొన్నారు. కాగా.. భారత్, చైనాల సైనికాధికారులు శుక్రవారం సిక్కింలోని నాథులా మార్గంలో చర్చలు జరిపినట్లు తెలిసింది. సమావేశంలో డోక్లామ్ ప్రతిష్టంభన అంశం ప్రస్తావనకొచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. -
కబళిం‘చైనా’..!
సిక్కిం సెక్టార్‌లోని డోక్లామ్ వద్ద భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొని దాదాపు 50 రోజులైంది. నిజానికది భూటాన్ భూభాగం. అక్కడ చైనా రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నిస్తుండగా... అది తమ ప్రయోజనాలకు భంగకరమంటూ భారత్ అడ్డుపడింది. కానీ చైనా మాత్రం వివాదాన్ని పెద్దది చేయడం ద్వారా తాము అనుకున్నది సాధించింది. అక్కడేదో వివాదాస్పద అంశం ఉందనే అభిప్రాయాన్ని అంతర్జాతీయంగా కలిగించడంలో సఫలమైంది. తొలుత సైనిక బలంతో ఇతర దేశాల భూభాగాన్ని దురాక్రమించడం, తర్వాత అది తమ అంతర్భాగమని అంతర్జాతీయ వేదికలపై నొక్కి చెప్పడం...ఇది చైనాకు పరిపాటిగా మారింది. ఫలితంగా సదరు చైనా ఆక్రమిత భూభాగం కాస్తా వివాదాస్పద భూభాగంగా మారిపోతోంది. చిలక్కొట్టుడుతో ప్రారంభించి మెల్లిగా దురాక్రమణను విస్తరించడం చైనా అనుసరించే మరో పద్ధతి. డోక్లామ్ కవ్వింపును కూడా చైనా విస్తరణ కాంక్షలో భాగంగానే ప్రపంచ దేశాలు చూడాల్సిన అవసరం ఉంది. 1949లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచీ చైనా దురాక్రమణలను వివరించేదే ఈ కథనం. టిబెట్‌తో మొదలు... మావో జెడాంగ్ నేతృత్వంలో సీపీసీ అధికారం చేపట్టిన కొద్దినెలల్లోనే చైనా విస్తరణపై దృష్టి పెట్టింది. బౌద్ధమతగురువుల పాలనలో స్వతంత్ర దేశంగా ఉన్న టిబెట్‌ను బలవంతంగా ఆక్రమించి 12 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమలో కలిపేసుకుంది. టిబెట్ పీఠభూమికి పశ్చిమాన ఉన్న షిన్జియాంగ్ ప్రాంతాన్ని కూడా కలిపేసుకుంది. 12 లక్షల చదరపు కిలోమీటర్ల టిబెట్, 16.64 లక్షల చదరపు కిలోమీటర్ల షిన్జియాంగ్ కలవడంతో చైనా భూభాగం ఏడాదిలోపే రెట్టింపైంది. అక్సాయ్ చిన్... హాంఫట్ 1962లో అక్సాయ్‌చిన్, అరుణాచల్‌ప్రదేశ్‌లు తమవేనంటూ భారత్‌తో చైనా యుద్ధానికి దిగింది. అరుణాచల్‌లో తవాంగ్‌ను ఆక్రమించినా యుద్ధం ముగిశాక తిరిగిచ్చింది. తవాంగ్ నుంచి వెనక్కితగ్గి మెక్మెహన్ రేఖను గౌరవిస్తున్నట్లు ప్రకటించిన చైనా...37,224 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అక్సాయ్‌చిన్‌ను మాత్రం తమ దేశంలో కలిపేసుకుంది. నిజానికి 1957లోనే చైనా అక్సాయ్‌చిన్‌లో రోడ్డును నిర్మించింది. మన నిఘావర్గాలు ఆలస్యంగా మేలుకొన్నాయి. నెహ్రూ ప్రభుత్వం దీన్ని చైనా వద్ద లేవనెత్తింది తప్పితే బహిరంగ పర్చలేదు. 1993లో కుదిరిన ఒప్పందంతో అక్సాయ్చిన్పై చైనా నియంత్రణను పరోక్షంగా అంగీకరిస్తూ వాస్తవాధీన రేఖను భారత్ గుర్తించింది. దక్షిణ చైనా సముద్రంపై పేచీ... సహజ వనరులు, అపార సహజవాయువు నిలువలున్న దక్షిణ చైనా సముద్రంలో దాదాపు 80 శాతం తమ ప్రాదేశిక జలాలేనని చైనా వాదిస్తోంది. ఇతర దక్షిణ చైనా సముద్ర తీరదేశాలైన ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనై, ఇండోనేషియా, సింగపూర్, వియత్నాం చైనా వాదనతో విభేదిస్తున్నాయి. చైనా ఇక్కడ కృత్రిమ దీవులను నిర్మించి సైనిక స్థావరాలుగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని అమెరికా, జపాన్ గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని గుప్పిటపట్టే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ దేశం. వీటన్నింటిలోనూ చైనా విస్తరణ కాంక్ష ప్రస్ఫుటమవుతోంది. కాబట్టి డోక్లామ్‌లో చైనాను అడ్డుకోవడం పొరుగునున్న భారత్‌కు ముఖ్యం. దీవులపై డ్రాగన్ కన్ను... ఆ తర్వాత చైనా వ్యూహాత్మకంగా కీలకమైన దీవులపై దృష్టి పెట్టింది. దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో దీవులను వేర్వేరు దేశాల నుంచి లాగేసుకుంది. వియత్నాం అధీనంలోని పారాసెల్ దీవులను 1974లో, జాన్సన్ రీఫ్‌ను 1988లో, మిస్చీఫ్ రీఫ్‌ను 1995లో చేజిక్కించుకుంది. 2012లో ఫిలిప్పీన్స్ నుంచి స్కార్బొరో షోల్ను స్వాధీనం చేసుకుంది. వీటి సమీపంలోకి ఇతర దేశాల నౌకల రాకపోకలను నియంత్రించింది. అయితే 2016లో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు దుతర్తే అమెరికాతో దీర్ఘకాలిక సంబంధాలను తెంచుకొని చైనా పంచన చేరడంతో ఇప్పుడు ఫిలిప్సిన్స్ మత్యకారులను అక్కడికి అనుమతిస్తున్నారు. అటు తూర్పు చైనా సముద్రంలో ఉన్న సెంకాకూ దీవులు తమవేనంటూ వివాదం చేస్తోంది చైనా. ఈ దీవుల పరిసరాల్లో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. చమురు నిక్షేపాలు కూడా ఉన్నట్లు 1970లో కనుగొన్నారు. దాంతో చైనా కన్ను సెంకాకూ దీవులపై పడింది. అప్పటినుంచి ఏదో ఒక మిషతో సెంకాకూ దీవులను చైనా వివాదాస్పదమైనవిగా చూపే ప్రయత్నం చేస్తోంది. -
‘డోక్లామ్’పై సైనిక చర్యకు చైనా యోచన
బీజింగ్: డోక్లామ్ ప్రతిష్టంభనకు దౌత్య మార్గంలో పరిష్కారం కనుగొంటామని భారత్ ప్రతిపాదిస్తుంటే, చైనా ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఆ వివాదాస్పద ప్రాంతం నుంచి భారత బలగాలను తరిమికొట్టేందుకు సైనిక చర్యకు దిగాలని చైనా యోచిస్తున్నట్లు ఆ దేశ అధికార మీడియాలో శనివారం కథనం ప్రచురితమైంది. ‘డోక్లామ్‌లో మిలిటరీ ప్రతిష్టంభనను చైనా ఎక్కువ కాలం కొనసాగనివ్వదు. భారత దళాలను వెళ్లగొట్టేందుకు రెండు వారాల్లో చిన్నపాటి సైనిక చర్యకు దిగొచ్చు’ అని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లోని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పరిశోధకుడు హు జియోంగ్ను ఉటంకిస్తూ ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
బలగాలను కుదించలేదు
♦ డోక్లాంపై చైనా నివేదికను కొట్టిపారేసిన భారత్ ♦ ఇరు దేశాలు 400 మంది చొప్పున మోహరించాయని స్పష్టీకరణ బీజింగ్: సిక్కింలోని డోక్లాంలో తమ సైనికులను 270 నుంచి 40కి తగ్గించామని చైనా పేర్కొనడాన్ని భారత్ తోసిపుచ్చింది. అక్కడి నుంచి భారత బలగాలను కుదించలేదని, ఇరు దేశాలు ఇంకా 400 మంది సైనికుల చొప్పున మోహరించాయని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. డోక్లాం నుంచి భారత సైనికులు బేషరతుగా వైదొలగితేనే సమస్య పరిష్కారమవుతుందని చైనా స్పష్టం చేసింది. జూన్ 16న ఇరు దేశాల మధ్య డోక్లాంలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి మ్యాపులు, ఇతర వివరాలతో చైనా బుధవారం 15 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేసింది. ‘ చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు జూన్ 18న సుమారు 270 మంది భారత సైనికులు మా భూభాగంలో 100 మీటర్ల లోనికి చొచ్చుకొచ్చారు. ఆ తరువాత 400 మందికి పైగా సైనికులు అక్రమంగా మూడు గుడారాలు ఏర్పాటుచేసుకుని సుమారు 180 మీటర్లలోనికి చొరబడ్డారు. జూలై చివరి నాటికి 40 మంది భారత సైనికులు, ఒక బుల్డోజర్ అక్రమంగా చైనా భూభాగంలో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. చైనా రోడ్డు నిర్మాణం వల్ల తన వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాల సరిహద్దులపై స్పష్టత ఉన్న ప్రాంతంలోనే ప్రతిష్టంభన నెలకొందని చైనా నివేదిక తెలిపింది. సరిహద్దులను నిర్ధారించిన తరువాత కూడా తమ భూభాగంలోకి భారత సైనికులు చొరబడటం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించింది. సిక్కిం సెక్టార్లో చైనా–ఇండియా సరిహద్దు మౌలిక రూపాన్ని మార్చాలని భారత్ ప్రయత్నించడం చైనా భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ ప్రస్తుత వివాదం చైనా–భూటాన్లది. ఇందులో భారత్ చేయగలిగేదేం లేదు. చైనా–భూటాన్ సరిహద్దు చర్చలకు అడ్డుపడే హక్కు భారత్‌కు లేదు. తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. భారత్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత, శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉంటుంది’ అని నివేదిక స్పష్టం చేసింది. తాము డోక్లాంలో చేపట్టబోయే రోడ్డు నిర్మాణం గురించి అంతకు ముందే భారత్‌కు సమాచారమిచ్చినట్లు చైనా పేర్కొంది. బేషరతుగా వెనుదిరిగితేనే... డోక్లాం నుంచి భారత్ తన బలగాలను బేషరతుగా విరమించుకోవడానికి చర్యలు తీసుకుంటేనే ప్రస్తుత వివాదం సద్దుమణుగుతుందని చైనా స్పష్టం చేసింది. జూలై 28న భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారు యాంగ్ జియేచి మధ్య జరిగిన చర్చల వివరాలను చైనా విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. -
మా జోలికొస్తే ఊరుకోం: జిన్‌పింగ్
బీజింగ్: చైనా ఏ దేశంలోని ప్రాంతాన్నీ దురాక్రమించుకోదనీ, కానీ తన భూభాగాన్ని లాక్కోవాలని చూస్తే ఊరుకోదని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మంగళవారం చెప్పారు. పొరుగుదేశాలకు గట్టి సమాధానం చెబుతూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతోందంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని జిన్‌పింగ్ ప్రశంసించారు. జూన్ నెల మధ్య నుంచి సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం వద్ద భారత్–చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సిక్కిం గురించి నేరుగా ప్రస్తావించని జిన్‌పింగ్.. యుద్ధసన్నద్ధతపై దృష్టి పెట్టాలని ఆర్మీకి సూచించారు. పీఎల్ఏ 90వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
దోవల్ వల్లే డోక్లామ్ ఉద్రిక్తత: చైనా
బీజింగ్/న్యూఢిల్లీ: సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌లో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వల్లే ఉద్రిక్తత నెలకొందని చైనా అధికార మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం ఆరోపించింది. గురువారం నుంచి జరిగే బ్రిక్స్ దేశాల జా తీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) సమావేశం కోసం బీజింగ్‌కు వెళ్తున్న దోవ ల్.. సరిహద్దు వివాదంపై చైనా ఎన్ఎస్ఏ తో చర్చించే అవకాశమున్న నేపథ్యంలో ఈ విమర్శలు చేయడం గమనార్హం. చైనాతో ముప్పు: ఆర్మీ వైస్ చీఫ్ భారత పొరుగు ప్రాంతాల్లోని హిమాలయాల వెంబడి చైనా ప్రభావం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో మనకు ముప్పుగా మారొచ్చని ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ శరత్ చంద్ చెప్పారు. చైనా తన భద్రతపై చేస్తున్న ఖర్చులో చాలా భాగాన్ని బహిర్గతం చేయడం లేదని అన్నారు.ఈ పరిస్థితుల్లో భారత్ తన సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలన్నారు.