బలగాలను కుదించలేదు
♦ డోక్లాంపై చైనా నివేదికను కొట్టిపారేసిన భారత్
♦ ఇరు దేశాలు 400 మంది చొప్పున మోహరించాయని స్పష్టీకరణ
బీజింగ్: సిక్కింలోని డోక్లాంలో తమ సైనికులను 270 నుంచి 40కి తగ్గించామని చైనా పేర్కొనడాన్ని భారత్ తోసిపుచ్చింది. అక్కడి నుంచి భారత బలగాలను కుదించలేదని, ఇరు దేశాలు ఇంకా 400 మంది సైనికుల చొప్పున మోహరించాయని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. డోక్లాం నుంచి భారత సైనికులు బేషరతుగా వైదొలగితేనే సమస్య పరిష్కారమవుతుందని చైనా స్పష్టం చేసింది. జూన్ 16న ఇరు దేశాల మధ్య డోక్లాంలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి మ్యాపులు, ఇతర వివరాలతో చైనా బుధవారం 15 పేజీల సమగ్ర నివేదికను విడుదల చేసింది.
‘ చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునేందుకు జూన్ 18న సుమారు 270 మంది భారత సైనికులు మా భూభాగంలో 100 మీటర్ల లోనికి చొచ్చుకొచ్చారు. ఆ తరువాత 400 మందికి పైగా సైనికులు అక్రమంగా మూడు గుడారాలు ఏర్పాటుచేసుకుని సుమారు 180 మీటర్లలోనికి చొరబడ్డారు. జూలై చివరి నాటికి 40 మంది భారత సైనికులు, ఒక బుల్‌డోజర్ అక్రమంగా చైనా భూభాగంలో ఉన్నాయి’ అని నివేదిక పేర్కొంది. చైనా రోడ్డు నిర్మాణం వల్ల తన వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతింటాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
రెండు దేశాల సరిహద్దులపై స్పష్టత ఉన్న ప్రాంతంలోనే ప్రతిష్టంభన నెలకొందని చైనా నివేదిక తెలిపింది. సరిహద్దులను నిర్ధారించిన తరువాత కూడా తమ భూభాగంలోకి భారత సైనికులు చొరబడటం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించింది. సిక్కిం సెక్టార్‌లో చైనా–ఇండియా సరిహద్దు మౌలిక రూపాన్ని మార్చాలని భారత్ ప్రయత్నించడం చైనా భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ ప్రస్తుత వివాదం చైనా–భూటాన్‌లది. ఇందులో భారత్ చేయగలిగేదేం లేదు. చైనా–భూటాన్ సరిహద్దు చర్చలకు అడ్డుపడే హక్కు భారత్‌కు లేదు.
తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునేందుకు చైనా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. భారత్‌తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత, శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉంటుంది’ అని నివేదిక స్పష్టం చేసింది. తాము డోక్లాంలో చేపట్టబోయే రోడ్డు నిర్మాణం గురించి అంతకు ముందే భారత్‌కు సమాచారమిచ్చినట్లు చైనా పేర్కొంది.
బేషరతుగా వెనుదిరిగితేనే...
డోక్లాం నుంచి భారత్ తన బలగాలను బేషరతుగా విరమించుకోవడానికి చర్యలు తీసుకుంటేనే ప్రస్తుత వివాదం సద్దుమణుగుతుందని చైనా స్పష్టం చేసింది. జూలై 28న భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా భద్రతా సలహాదారు యాంగ్ జియేచి మధ్య జరిగిన చర్చల వివరాలను చైనా విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది.