న్యూఢిల్లీ: డోక్లామ్ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ల్లో ఉన్న సరిహద్దుల వెంట భారత్ తన బలగాల సంఖ్యను పెంచిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. డోక్లామ్‌లో పరిస్థితిని, చైనా దూకుడైన వైఖరిని సమగ్రంగా విశ్లేషించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బలగాల అప్రమత్తత స్థాయులను పెంచినట్లు పేర్కొన్నారు.
తూర్పు భాగంలో సున్నితమైన భారత్–చైనా సరిహద్దులో... సుక్నా కేంద్రంగా పనిచేస్తున్న 33 కార్ప్స్, అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 3,4 కార్ప్స్ దళాలను మోహరించినట్లు పేర్కొన్నారు. కాగా.. భారత్, చైనాల సైనికాధికారులు శుక్రవారం సిక్కింలోని నాథులా మార్గంలో చర్చలు జరిపినట్లు తెలిసింది. సమావేశంలో డోక్లామ్ ప్రతిష్టంభన అంశం ప్రస్తావనకొచ్చినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.