
జనాలు మెచ్చే వనాలు..
సాక్షి: పట్టణాల్లో నివసించే ప్రజలను కాసేపైనా కాలుష్యం నుంచి దూరం చేసి ప్రశాంతతను చేకూర్చేందుకు ఉద్యానవనాలు తోడ్పడుతున్నాయి. పచ్చని చెట్లతో రంగురంగుల పుష్పాలతో ప్రత్యేకంగా ముస్తాబైన గార్డెన్‌లో సేదతీరడం ఎంతో హాయిగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం కొన్ని వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తే అదో ప్రత్యేక ప్రపంచమే. పర్యాటకులకు కన్నుల పండువ చేస్తున్న ప్రపంచంలోని కొన్ని ప్రత్యేక గార్డెన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..!
నాంగ్ నూచ్ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్..
థాయ్‌లాండ్‌లోని చోన్‌బురికి 163 కిలోమీటర్ల దూరంలో ఉంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రముఖ వైజ్ఞానిక పరిశోధనా కేంద్రంగా కూడా సేవలందిస్తోంది. జన్యు బ్యాంక్‌ను స్థాపించిన సైకాడ్స్‌కు దీన్ని అంకితం చేశారు. 1954లో పండ్లసాగు చేద్దామనే ఉద్దేశంతో పిసిట్, నాంగ్‌నూచ్‌లు 600 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే తర్వాత నిర్ణయం మార్చుకుని వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ పేరుతో ఉష్ణమండల వాతావరణానికి సరిపడే పూలమొక్కలను పెంచడం ప్రారంభించారు. 1980 నుంచి సందర్శకులను అనుమతించడం మొదలు పెట్టారు.
క్యూ గార్డెన్స్..
1759లో బ్రిటన్ రాణి అగస్టా ఏర్పాటు చేశారు. పశ్చిమ లండన్‌లోని రిచ్‌మండ్‌లో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ జాతులకు చెందిన మొక్కలను కలిగిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 50,000 రకాల మొక్కలు కొలువుతీరాయి. 326 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గార్డెన్‌లో పగోడా, ది టెంపెరేట్ హౌస్.. వంటి ప్రసిద్ధి చెందిన భవనాలు మరో ప్రత్యేక ఆకర్షణ. 2003లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. లండన్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఇదీ ఒకటి. దీని సంరక్షణ కోసం 1847లో స్వయంగా ఒక ప్రత్యేక పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 750 మంది ఉద్యోగులు ఇందులో విధులు నిర్వర్తిస్తున్నారు.
వెర్‌సెల్లైస్ గార్డెన్..
ఫ్రాన్స్‌లోని వెర్‌సెల్లైస్‌లో ఉంది. సుమారు 1900 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యాన వనంలో 2 లక్షల మొక్కలు ఉన్నాయి. ఏటా 3 లక్షల వరకు పుష్పాలను అందిస్తుంది. వీటితో పాటు 50 ఫౌంటెయిన్‌లు, 620 వాటర్ జెట్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. డిజైనర్లు ఆండ్రూ లే నోట్రే, చార్లెస్ లే బ్రన్, లూయిస్ లేవా, హాడ్రూయిన్ మన్‌సార్ట్‌లు దీనికి రూపకల్పన చేశారు. 1979లో దీనికి వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చోటు దక్కింది.
కెకెన్ హోప్ గార్డెన్స్..
దీన్ని ‘గార్డెన్ ఆఫ్ యూరప్’ అని పిలుస్తారు. నెదర్లాండ్స్‌లోని లిస్సే పట్టణంలో ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ‘ఫ్లవర్ గార్డెన్స్’లో ఇదీ ఒకటి. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనంలో ఏటా 70 లక్షలకు పైగా పుష్పాలు వికసిస్తున్నాయి. ఇన్ని రకాల పుష్పాలు ఒకేచోట కొలువుతీరడం ప్రపంచ రికార్డు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే పర్యాటకులను అనుమతిస్తారు. దీన్ని సందర్శించేందుకు ఏప్రిల్ అనుకూల సమయం. ఈ ఏడాది ఏప్రిల్ 25న ఫ్లవర్ పరేడ్ నిర్వహించారు.
బట్‌చార్ట్ గార్డెన్స్..
కెనడాలోని బ్రిటిష్‌కొలంబియాలో ఉంది. ఏటా 10 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ గార్డెన్‌ను సందర్శిస్తున్నారు. సిమెంట్ తయారీ సంస్థ అధినేత రాబర్ట్ పిమ్ బట్‌చార్ట్ దీన్ని ఏర్పాటు చేశారు. మొదట్లో ఆయన ఇంటి పరిసర ప్రాంతంలో సొంత గార్డెన్‌గా ప్రారంభించారు. బట్‌చార్ట్ భార్య ఉత్సుకతతో ఇందులో శాంక్చురీ కూడా ప్రారంభమైంది. దేశవిదేశాలకు చెందిన అనేక రకాల పక్షులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వేసవిలో ప్రత్యేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
డిసెర్ట్ బొటానికల్ గార్డెన్..
‘ది డిసెర్ట్ బొటానికల్ గార్డెన్’ సెంట్రల్ ఆరిజోనాలోని గాల్విన్ పార్క్‌వే సమీపంలో ఉంది. విస్తీర్ణం 140 ఎకరాలు. 1937లో అరిజోనా కాక్టస్ అండ్ నేటివ్ ఫ్లోరా సొసైటీ 1937లో దీన్ని స్థాపించింది. ప్రస్తుతం ఇందులో 21,000 మొక్కలు ఉన్నాయి. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న 139 రకాల జీవ జాతులను ఇక్కడ సంరక్షిస్తున్నారు.