కొలంబో: శ్రీలంకలో ఇంకా బాంబుల మోత మోగుతోంది. ఈస్టర్ సండే రోజు జరిగిన మారణహోమం నుంచి తేరుకోకముందే.. శుక్రవారం రాత్రి మరోసారి మానవ బాంబులు పేలాయి. ఉగ్రవాదులపై భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా కాల్పులకు పాల్పడగా.. ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈస్టర్ పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా సమ్మంతురై ప్రాంతంలో ఉగ్రస్థావరంపై సైన్యం దాడులు నిర్వహించింది.
భద్రతాబలగాల రాకను పసిగట్టిన దుండగులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది మృతిచెందారు. ఈ స్థావరం నుంచి భద్రతాబలగాలు భారీగా పేలుడు పదార్థాలు, ఐసిస్ యూనిఫారాలను స్వాధీనం చేసుకున్నాయి. శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్లలో 253 మంది మరణించారు. 500మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఈ దాడులకు ఐసిస్ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment