అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలనలో వైట్‌హౌస్ ఉద్యోగాలు వదిలిపోతున్నవారి సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. మొదటి ఏడాదిలోనే అధ్యక్షభవనంలో పనిచేసే 34 శాతం ఉన్నత స్థాయి సిబ్బంది రాజీనామా చేయడమో, ఉద్వాసనకు గురవడమో లేదా ఇతర ప్రభుత్వ పదవుల్లో చేరడమో జరిగింది. ట్రంప్‌కు ముందు అగ్రరాజ్య అధినేతలుగా పనిచేసిన ఐదుగురు హయాంతో పోల్చితే ఇలా పదవులకు స్వస్తి పలుకుతున్న ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు చాలా ఎక్కువ. గడచిన కొన్ని దశాబ్దాల్లో కూడా అత్యంత పలుకుబడి కలిగిన ఉద్యోగాలకు ఇంత మంది గుడ్ బై చెప్పలేదు. సామర్ధ్యం కన్నా విధేయతకే అధ్యక్షుడు ప్రాధాన్యం ఇవ్వడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమని వైట్ హౌస్ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ తొలి ఏడాది వైట్ హౌస్ ఉన్నతాధికార పదవులకు స్వస్త చెప్పిన వారి సంఖ్య ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ కాలంతో(మొదటి సంవత్సరం 17 శాతం) పోల్చితే రెట్టింపు కాగా, బిల్ క్లింటన్ కాలంతో(11 శాతం) పోల్చితే మూడు రెట్లుందని ప్రసిద్ధ అమెరికా సంస్థ బ్రూకింగ్స్ఇన్‌స్టిట్యూషన్ తాజా సర్వేలో వెల్లడించింది. ట్రంప్ వైట్ హౌస్‌లో ప్రథమశ్రేణి 12 పదవుల్లో చేరిన ఆరుగురు (చీఫ్ఆఫ్ స్టాఫ్ రీన్స్ ప్రీబస్, డెప్యూటీ చీఫ్ఆఫ్ స్టాఫ్ కేటీ వాల్ష్, ప్రెస్ సెక్రెటరీ షాన్ స్పైసర్, ప్రజాసంబంధాల కార్యాలయం డైరెక్టర్ జార్జ్ సిఫాకిస్, జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ప్లిన్, జాతీయ భద్రతా ఉప సలహాదారు కేటీ మెక్ ఫార్లండ్) ఏడాది లోపే నిష్క్రమించడం విశేషం. బరాక్ఒబామా కాలంలో రాజీనామా చేసిన ఈ స్థాయి అధికారి వైట్‌హౌస్ కౌన్సెల్‌గా చేరిన గ్రెగ్ క్రేగ్ఒక్కరే. ట్రంప్ సర్కారు నుంచి పదవీబాధ్యతలు చేపట్టిన 24 రోజులకే మైకేల్ ప్లిన్ వైదొలగడం సంచలనం సృష్టించింది.
కిందటి వారం ముగ్గురు వైదొలిగారు!
బ్రూకింగ్స్‌లో పాలనావ్యవహారాల అధ్యయన విభాగంలో పనిచేస్తున్న కేతరిన్ డన్ టెన్‌పాస్ పూర్వ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ (1981-89) కాలం నుంచి వైట్‌హౌస్ ఉన్నత సిబ్బంది రాజీనామాలు, ఉద్వాసనలపై విశ్లేషణ జరిపారు. కిందటి జనవరి మధ్యలో ఆమె అధ్యయన పత్రం విడుదల చేశాక పలువురు అధికారులు అధ్యక్షభవనం కొలువుల నుంచి బయటపడ్డారు. కిందటి వారం ఉద్యోగాల నుంచి స్టాఫ్ సెక్రెటరీ రాబర్ట్ పోర్టర్, న్యాయశాఖలో మూడో ర్యాంక్ పదవిలో ఉన్న రాకేల్ బ్రాండ్, ఉపన్యాస రచయిత డేవిడ్ సొనెన్ సన్ తప్పుకున్నారు. ట్రంప్అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న పాల్మానాఫోర్ట్అధ్యక్షభవనం పదవి దేనినీ చేపట్టకపోయినా అధ్యక్షుడి కీలక సలహాదారుల బృందం నుంచి కొన్ని నెలలకే వైదొలగాల్సి వచ్చింది. 2016 ఎన్నికల్లో అక్రమంగా నగదు చలామణికి పాల్పడ్డారని స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ మలర్అభియోగం నమోదుచేయడంతో మానాఫోర్ట్ తెరవెనుకకు వెళ్లారు. ఏ క్షణంలోనైనా ఉద్వాసనకు గురయ్యే ప్రముఖుల జాబితాలో వైట్‌హౌస్ స్టాఫ్ జాన్ కెలీ, అటార్నీ జనరల్(అమెరికా న్యాయశాఖా మంత్రి) జెఫ్ సెషన్స్, విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్‌సన్ ఉన్నారు. రాబర్ట్ పోర్టర్‌తో ‘సన్నిహిత’ సంబంధాలున్న వైట్‌హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర హోప్ హిక్స్ కూడా ఏ రోజైనా ఈ జాబితాలో చేరతారు.
గందరగోళంలో వైట్‌హౌస్
తరచు సిబ్బంది మారడంతో వైట్‌హౌస్‌లో గందరగోళ పరిస్థితులు మొదటి నుంచీ కొనసాగుతున్నాయి. కొద్ది మంది వైదొలగడం, కొందరు కొత్తవారు రావడం మొత్తంమీద అధ్యక్షభవనం పనితీరుకు ప్రయోజనకరమేగాని, మితిమీరిన సంఖ్యలో ఉన్నతస్థాయి సిబ్బంది మారడం సమస్యలకు దారితీస్తుందని కేతరిన్అభిప్రాయపడ్డారు.‘‘డెమొక్రాటిక్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్తో పోల్చితే కొద్ది మంది ఆధ్వర్యంలో మెరుపుదాడి తరహాలో సాగిన ట్రంప్ఎన్నికల ప్రచారం వల్ల కావలసినంత మంది సమర్థులు వైట్‌హౌస్‌కు లభ్యంకాలేదు. ఫలితంగా అధ్యక్షభవనం అనుభవం లేని అనేక మంది కొత్త వ్యక్తులకు అవకాశాలు వచ్చాయిగాని దాని వల్ల పనితీరు మందగించింది. తొలి ఏడాదే అనేక మంది వెంటవెంటనే నిష్క్రమించడానికి దారితీసింది.’’ అని ఆమె విశ్లేషించారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment