టెహ్రాన్ : ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో.. 35 మంది మృతి చెందగా, 48 మంది గాయపడినట్టు ఇరాన్ ప్రభుత్వ చానల్ తెలిపింది. సులేమానీ స్వస్థలం కెర్మన్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ చీఫ్ కౌలివాండ్ ధ్రువీకరించారు. సులేమానీ అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయులు తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా.. అందులో పలువురు రోడ్డుపై విగత జీవులుగా కనిపించగా.. మరికొందరు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ కనిపించారు.
కాగా, బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతని మృతదేహాన్ని టెహ్రాన్‌కు తరలించారు. సులేమానీ అంతిమయాత్రలో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సహా సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ పాల్గొన్న అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిన బూనారు. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment