చిన్నప్పుడు చూసి... ఇప్పుడు చేశాడు!
దీపావళి రోజున మీరెప్పుడైనా రాకెట్ టపాసు కాల్చారా? నిప్పంటించిన వెంటనే అది గాల్లోకి రయ్యిమని దూసుకెళుతూంటే ముచ్చటేస్తుంది. మరి... రాకెట్ సైజు.. మోటార్‌సైకిలంత ఉంటే...? దానిపై ఓ మనిషి కూర్చుని ఉంటే... అతడే ఇంజిన్‌ను ఆన్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు తెలియకపోతే ఎడ్డీ బ్రాన్‌ను అడగండి. ఆయనెవరు అంటారా? పక్కన ఫొటోలో కనిపిస్తున్న వాహనాన్ని నడిపించింది ఆయనే మరి! దీంతోనే ఆయన అమెరికాలోని ఇడాహో ప్రాంతంలో ఉన్న రివర్ క్యానన్ (అగాధం) ను దాటేశాడు. ఈ అగాధం వెడల్పు ఎంతో తెలుసా? సింపుల్‌గా... 4000 అడుగులు మాత్రమే! హాలీవుడ్ సినిమాల్లో స్టంట్ కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న ఎడ్డీ తన చిన్నప్పటి కలను సాకారం చేసుకునేందుకు ఈ రికార్డు స్టంట్ చేశాడట.
1974లో ఎవెల్ క్నీవెల్ అనే స్టంట్ మాస్టర్ ఇదే అగాధాన్ని దాటేందుకు విఫలయత్నం చేశాడు. చిన్న పిల్లాడిగా ఆ స్టంట్‌ను చూసిన ఎడ్డీ తాను ఆ రికార్డును సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియా స్టంట్ కో-ఆర్డినేటర్ రిక్ మోరిసన్‌తోపాటు కొంతమంది రాకెట్ ఇంజనీర్ల సాయంతో నీటి ఆవిరితో పనిచేసే మోటార్‌సైకిల్‌ను సిద్ధం చేసుకున్నాడు. చివరకు ఈ ఏడాది సెప్టెంబర్ 16న ‘ఎవెల్ స్పిరిట్’ పేరుతో సిద్ధం చేసిన స్టీమ్ రాకెట్ మోటార్‌సైకిల్‌తో విజయం సాధించాడు. ఇంజిన్ ఆన్ చేయగానే.. కేవలం కొన్ని సెకన్ల కాలంలోనే దాదాపు గంటకు 693 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్న ఎడ్డీ 2200 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి రెండు పారాచూట్ల సాయంతో అగాధం ఆ చివరకు చేరుకున్నాడు. గిన్నిస్ రికార్డులకు ఎక్కాడు