చక్కెర పదార్థాల వల్లనే గుండె జబ్బులు | Sugar material leading to heart problems, say scientists | Sakshi
Sakshi News home page

చక్కెర పదార్థాల వల్లనే గుండె జబ్బులు

Published Thu, Sep 15 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

చక్కెర పదార్థాల వల్లనే గుండె జబ్బులు

చక్కెర పదార్థాల వల్లనే గుండె జబ్బులు

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచంలో గుండెజబ్బులకు శస్త్రచికిత్స చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేటి పరిస్థితుల్లో కూడా అమెరికా లాంటి దేశాల్లో గుండెపోటు వల్ల ఎక్కువమంది ఎందుకు మరణిస్తున్నారు? అసలు గుండెజబ్బులు రావడానికి కారణం ఏంటి.. మాంసం లాంటి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, శారీరక కష్టం తగ్గిపోవడం, వాతావరణ కాలుష్యం కారణాలా? అవునని చెబుతారు ఎవరైనా!
 
కానీ ఇది తప్పని, మనం తినే మాంసం పదార్థాలకన్నా చక్కెర (షుగర్‌) పదార్థాలే గుండెకు ఎక్కువ హానికరమని దాదాపు 60 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా తేల్చారు. అమెరికా చక్కెర పారిశ్రామికవేత్తలు, కోక్, పెప్సీ లాంటి శీతల పానీయాలను విక్రయించే కంపెనీలు కుమ్మక్కై పరిశోధనల ఫలితాలను తలకిందులు చేశారు. షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే రక్తంలో ట్రైగ్లిసరేడ్స్ ఎక్కువగా తయారవుతాయని, అవి గుండెపోటుకు కారణం అవుతాయని వారికి తెలుసు. కానీ ఆ కంపెనీలు తమ లాభాల కోసం నెపాన్ని మాంసం లాంటి కొవ్వు పదార్థాల మీదకు నెట్టేశారు.   
 
ఈ విషయాలను శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్శిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ లారా స్కీమిట్, ‘యూసీఎస్‌ఎఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ డెంటిస్ట్రీ’లో పరిశోధకులుగా ఉన్న క్రిస్టిన్‌ కియర్న్స్, యూసీఎస్‌ఎఫ్‌ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ స్టాన్‌గ్లాంజ్‌  ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురించారు. వీరు చేసిన తాజా విశ్లేషణలు ఇప్పుడు షుగర్‌ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. వారు తమ వాదనను నిజమని నిరూపించేందుకు 1959 - 1971 సంవత్సరాల మధ్య షుగర్‌ పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, వివిధ శాస్త్రవేత్తల మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలను సేకరించారు. తొక్కి పెట్టిన కొందరి శాస్త్రవేత్తల పరిశోధన పత్రాలను కూడా బయటపెట్టారు. 
 
షుగర్‌ వల్ల కలిగే ప్రయోజనాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో అమెరికా షుగర్‌ పరిశ్రమ 1943లో ‘షుగర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేసింది. ఆ ఫౌండేషన్‌లో పనిచేసిన శాస్త్రవేత్తలు సహజంగానే షుగర్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ‘షుగర్‌ అసోసియేషన్‌’ గా పేరు మార్చుకున్న ఈ ఫౌండేషన్‌లో పనిచేసిన కొంతమంది శాస్త్రవేత్తలు చక్కెర వల్ల గుండెజబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కూడా కనిపెట్టారు. వారి మాటలను బయటకు రానీయకుండా షుగర్‌ పరిశ్రమ తొక్కిపెట్టింది. 
 
1955లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్‌కు గుండెజబ్బు వచ్చినప్పుడు మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చింది. చనిపోతాడని అనుకున్న ఆయన డైటింగ్‌ ద్వారా, వ్యాయామం ద్వారా తన గుండెజబ్బును నయం చేసుకున్నారు. అసలు గుండెజబ్బులకు కారణమవుతున్న అంశాలు ఏమిటో కనుగొనాలని శాస్త్రవేత్తలను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. షుగర్‌ వల్లనే రక్తంలో ట్రైగ్లిసెరైడ్స్‌ పెరుగుతున్నాయని, వాటివల్లనే గుండెపోటు వచ్చి మనుషులు మృత్యువాత పడుతున్నారని బ్రిటిష్‌ ఫిజియోలజిస్ట్, న్యూట్రిషియనిస్ట్‌ జాన్‌ యుద్‌కిన్‌ 1960లో తేల్చి చెప్పారు. దాదాపు అదే సమయంలో మాంసం, ముఖ్యంగా కేంద్రీకృతమైన కొవ్వు పదార్థాల వల్ల రక్తంలో కొలస్ట్రాల్‌ పెరిగి గుండె జబ్బులు వస్తున్నాయని అమెరికాకు చెందిన ఫిజియోలజిస్ట్‌ ఆన్సెల్‌ కీస్‌ వెల్లడించారు. 
 
యుద్‌కిన్‌ పరిశోధనలను తేలిగ్గా తీసుకొని ఆన్సెల్‌ కీస్‌ వాదనను అమెరికా షుగర్‌ పరిశ్రమ తలకెత్తుకుంది. ఆ పరిశ్రమనే ఆయనతోనే తమకు అనుకూలంగా చెప్పించుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 1961లో ఆన్సెల్‌ కీస్‌ ఫొటోను టైమ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ముద్రించి ఆయనపై ప్రత్యేక కథనాన్ని నడిపింది. ఒక్క అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చక్కెర ఆధారిత ఆహార పరిశ్రమ విస్తరిస్తున్న కొద్దీ గుండె జబ్బులకు నెపాన్ని మాంసం మీదనే వేస్తూ వస్తున్నారు. మాంసం కన్నా చక్కెరపాళ్లను ఎక్కువగా తీసుకునే అమెరికాలో గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య సగటున ఏడాదికి 6,10,000 మంది. అంటే ప్రతి నలుగురిలో ఒకరి మరనానికి గుండెపోటే కారణం. ఈ నేపథ్యంలోనే గుండెను రక్షించుకునేందుకు మాంసం పదార్థాలకు దూరంగా ఉండాలంటూ 1980లో అమెరికా ప్రభుత్వం ఆరోగ్య హెచ్చరికను జారీ చేసింది. అలాగే ఎక్కువ చక్కెరను కూడా తినవద్దని కోరింది. చక్కెర ఎక్కువ తీసుకోవద్దన్నది గుండె రక్షణ కోసం కాకుండా పన్ల రక్షణ కోసం చెప్పడం విశేషం. 
 
20 ఔన్సుల కోకాకోలా బాటిల్‌లో 65 గ్రాముల షుగర్‌ ఉంటుంది. ఇది ఐదు చిన్న స్విస్‌ రోల్స్‌కు సమానం. 20 ఔన్సుల పెప్సీలో 69 గ్రాముల షుగర్‌ ఉంటుంది. 16 ఔన్సుల సన్నీ డీ ఆరేంజ్‌ జూస్‌లో 28 గ్రాముల షుగర్, హండ్రెడ్‌ పర్సెంట్‌ ఆపిల్‌ జూస్‌లో 49 గ్రాముల షుగర్, ఆరిజోనా గ్రీన్‌ హాని టీలో 23 గ్రాముల షుగర్‌ ఉంటుంది. రెడ్‌బుల్‌ ఎనర్జీ డ్రింక్‌లో 52 గ్రాముల షుగర్, 8 ఔన్సుల స్కిమ్‌ మిల్క్‌లో 11 గ్రాముల షుగర్‌ ఉంటుంది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement