ప్రపంచంలో నిరాశవాదులే ఎక్కువ
చైనా, భారతీయులే ఎక్కువ ఆశావాదులు
లండన్: ‘నీవున్న నీ దేశం సరైన పంథాలోనే వెళుతుందని నీవు భావిస్తున్నావా?’ అని ఏ దేశంలోనైనా ఆ దేశ పౌరుడినైనా ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? అవుననా, కాదనా? అవునని ఎక్కువ మంది చెబుతారా. కాదని ఎక్కువ మంది చెబుతారా? ప్రపంచంలో మూడింట రెండొంతలు మంది కాదనే చెబుతున్నారు. అంటే తమ దేశం సరైనా పంథాలో ప్రయాణించడం లేదన్నది వారి అభిప్రాయం. ఇప్సోస్, మోరిస్ సంస్థ ప్రపంచంలో 25 దేశాల్లో వేలాది ప్రజలను ప్రశ్నించడం ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచవ్యాప్తంగా తమ దేశం సరైన పంథాలో వెళుతోందని 37 శాతం మంది చెప్పగా, లేదని 63 శాతం మంది చెప్పారు. తమ దేశం సరైనా పంథాలో ప్రయాణిస్తోందని భావిస్తున్న దేశీయుల్లో చైనా ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారు. వారిలో ఏకంగా 90 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా, భారత్, రష్యా, అర్జెంటీనా, కెనడా, పెరు, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. భారత్ సరైనా పంథాలో వెళుతోందని ఆ దేశ ప్రజల్లో 76 శాతం మంది అభిప్రాయపడగా, లేదని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు.
బ్రెజిల్ మినహా బ్రిక్ దేశాలు, దక్షిణ కొరియా మినహా ఆసియా పసిఫిక్ దేశాల ప్రజలు సానుకూలంగా, అంటే ఆశావాద దృక్ఫథంలో స్పందించగా, ఇతర ప్రాంతాల దేశాల ప్రజలు ప్రతికూలంగా స్పందించారు. ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాల ప్రజలు తమ దేశాల భవిష్యత్తుపై నిరాశ నిస్పృహలు వ్యక్తం చేశారు. అమెరికాలో సరైన పంథాలో నడుస్తోందని 35 శాతం మంది అభిప్రాయపడగా, లేదని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇది కొత్త అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికాక ముందు నిర్వహించిన సర్వే. ఆ తర్వాత అక్కడి ప్రజల అభిప్రాయల్లో మార్పు వచ్చి ఉండవచ్చు. తమ దేశం సరైన పంథాలో నడవడం లేదని ఎక్కువ మంది భావించడానికి నిరుద్యోగమే ప్రధాన సమస్య.
నిరుద్యోగం ప్రధాన కారణంగా 38 శాతం మంది చూపగా, దారిద్య్రం, సామాజిక అసమానతులని 34 శాతం మంది, ఆర్థిక, రాజకీయ అవినీతని 33 శాతం మంది, నేరం, హింసని 29 శాతం మంది, వైద్య సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం కారణమని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇలాంటి సర్వేను 2010వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది నిర్వహిస్తుండగా, గతేడాదితో పోలిస్తే ప్రపంచంలో నిరాశవాదుల సంఖ్య ఈ సారి 35 శాతం నుంచి 37 శాతంకు పెరిగింది.