అత్యుత్తమ దేశం స్వీడన్..
భారత్‌కు 70వ స్థానం
లండన్: ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పనిచేయడంతో పాటు ప్రపంచ మానవజాతి బాగుకోసం సహకరిస్తున్న దేశంగా స్వీడన్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ మానవజాతి సంక్షేమం కోసం ఆయా దేశాలు చేస్తున్న కృషిని ఆధారంగా చేసుకుని ‘గుడ్ కంట్రీ 2015’ పేరుతో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 163 దేశాల జాబితాలో భారత్ 70వ స్థానం పొందింది. సైన్స్ అభివృద్ధి, సంస్కృతి, శాంతిభద్రతలు, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, సమానత్వం లాంటి 35కు పైగా ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్ సూచీలను తీసుకుని సర్వే నిర్వహించారు.
ఈ సర్వే మొదటి పది స్థానాల్లో స్వీడన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, బ్రిటన్, జర్మనీ, ఫిన్లాండ్, కెనడా, ఫ్రాన్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు నిలవగా, చివరి స్థానంలో లిబియా నిలిచింది. భారత్ కంటే చైనా మూడు స్థానాలు మెరుగ్గా 67వ స్థానం పొందింది. విభాగాల వారీగా చూస్తే భారత్ అంతర్జాతీయ శాంతి భద్రతల్లో 27వ, సమానత్వం, సమాజ శ్రేయస్సులో 127వ, ఆరోగ్యంలో 37వ, సైన్స్ అండ్ టెక్నాలజీలో 62వ, సంస్కృతిలో 119వ స్థానాల్లో నిలిచింది.