చెత్త చాలక.. దిగుమతి చేసుకుంటున్నారు!
చెత్త చాలక.. దిగుమతి చేసుకుంటున్నారు!
Published Mon, Dec 12 2016 10:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
సాధారణంగా ఏదైనా దేశంలో చెత్త ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు. కానీ స్వీడన్ మాత్రం చెత్త చాలక.. దిగుమతి చేసుకుంటానంటోంది. తమ దేశంలో ఉన్న అత్యాధునిక రీసైక్లింగ్ ప్లాంట్లలో ఉన్న చెత్తనంతటినీ రీసైకిల్ చేసేస్తున్నారు. ఆ దేశానికి కావల్సిన విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా కేవలం ఈ రీసైకిల్డ్ చెత్త నుంచే వస్తుంది! నిజానికి అక్కడ శిలాజ ఇంధనాలపై 1991 నుంచే భారీగా పన్నులు ఉన్నాయి. ఇక్కడి రీసైక్లింగ్ ప్లాంట్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. దేశంలో గత సంవత్సరం ఇళ్ల నుంచి వచ్చిన మొత్తం చెత్తలో కేవలం 1 శాతాన్ని మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించారట.
స్వీడన్‌లో జాతీయ రీసైక్లింగ్ పాలసీ కూడా ఉంది. దాని వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా చెత్తను దిగుమతి చేసుకుని దాన్నుంచి విద్యుత్ తయారుచేస్తున్నాయి. అంతేకాదు, చెత్తను మండించడం ద్వారా పుట్టే వేడిని.. ఒక నెట్‌వర్క్ ద్వారా ఇళ్లు కూడా సరఫరా చేస్తారు. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా పడిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా ఎవరికి వారు రూం హీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నెట్‌వర్క్ నుంచి వచ్చే వేడి సరిపోతుంది. కరెంటు, కేబుల్ లాగే వేడిని కూడా పైపుల ద్వారా అందిస్తారన్న మాట.
ఇలా అన్ని రకాలుగా చెత్తను ఉపయోగించుకోవడంతో.. దేశంలో ఇళ్ల నుంచి వస్తున్న చెత్త ఏమాత్రం సరిపోవడం లేదట. అందుకోసం స్వీడన్ వాళ్లు బయటి దేశాలనుంచి కూడా దిగుమతి చేసుకుంటామని ఆఫర్లు చేస్తున్నారు. మన దేశంలో చెత్త ఎక్కడపడితే అక్కడ ఉండటంతో 'స్వచ్ఛభారత్' లాంటి నినాదాలు ఇస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుండగా.. అక్కడ మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. అదే తరహా విధానాలను ఇక్కడ కూడా అమలుచేస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
యూరోపియన్ దేశాల్లో డంపింగ్ యార్డులలో చెత్తను పారేయడం మీద నిషేధం ఉంది. అందువల్ల భారీ జరిమానాలు కట్టడం కంటే.. ఎవరికి వాళ్లు రీసైక్లింగ్ ప్లాంట్లు పెట్టుకుని దాంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ప్రతిదేశంలోనూ ఇలాగే చేస్తే కాలుష్యం తగ్గడంతో పాటు బొగ్గు అవసరం కూడా తగ్గి కర్బన ఉద్గారాలు అదుపులోకి వస్తాయని అంటున్నారు.
Advertisement
Advertisement