అమెరికా దాడిలో వందలాది మంది మృతి!
డమాస్కస్: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడిలో వందలాది మంది మృతి చెందారని సిరియా సైన్యం వెల్లడించింది. ఇస్లామిక్ స్టేట్‌కు వ్యతిరేకంగా డెయిర్ ఇజ్-జోర్‌పై సంకీర్ణ సేనలు బుధవారం జరిపిన ఈ దాడిలో భారీ సంఖ్యలో సాధారణ పౌరులు మృతి చెందారని సిరియా సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆర్మీ జనరల్ కమాండ్ పేరుతో వెల్లడించిన ప్రకటనలో.. అమెరికా సేనల దాడిలో హాల్టా గ్రామం వద్ద భారీగా విష రసాయనాలు విడుదలయ్యాయని పేర్కొంది. దీంతో అక్కడ ఉన్న వందలాది మంది పౌరులు మృతి చెందారని వెల్లడించింది. విష వాయువుల వల్ల ఊపిరాడకపోవడం మూలంగా వీరంతా మృతి చెందారని సిరియా సైన్యం పేర్కొంది. కాగా.. సిరియా ప్రభుత్వం రసాయన దాడికి పాల్పడిందని ఆరోపిస్తూ సిరియన్ ఎయిర్‌బేస్‌పై ఇటీవల భారీ సంఖ్యలో క్షిపణులతో అమెరికా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి చెందారు.