హవాలా స్కామ్‌లో డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన ‘తాజ్ మహల్’ క్యాసినో ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే అమెరికా హవాలా నిరోధక నిబంధనలను ఏకంగా 106 సార్లు ఉల్లంఘించింది. 1990 ఏప్రిల్‌లో ఈ కాసినో ఏర్పాటుకాగా 1998లో అప్పటివరకు నిబంధనలను ఉల్లంఘించినందుకు 4,77,000 వేల డాలర్లను అమెరికా ఆర్థిక విభాగానికి పరిహారంగా చెల్లించింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక విభాగంతో చేసుకున్న ఒప్పందం కూడా అమెరికా బ్యాంకు గోప్య చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. 2015 సంవత్సరంలో కూడా ట్రంప్ కాసినో అమెరికా ఆర్థిక సంస్థతో ఇలాంటి ఒప్పందమే చేసుకొంది. ఆనాటి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు రాలేదు గానీ, 1998లో చేసుకున్న ఒప్పందం డాక్యుమెంట్లు మాత్రం బయటకు వచ్చాయి. వాటిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ న్యూస్ ఏజెన్సీ అప్పట్లోనే విడుదల చేసింది. హవాలా చట్టం నిబంధనలు ఉల్లంఘించిన స్కామ్‌పై అమెరికా ఆర్థిక విభాగానికి చెందిన దర్యాప్తు సంస్థ ‘ఫైనాన్సియల్ క్రైమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్’ దర్యాప్తు పత్రాలు ఫెడరల్ రికార్డుల్లో మరుగున పడిపోయాయి.
రష్యాతో ట్రంప్‌కున్న సంబంధాలపై కూడా అమెరికా పార్లమెంట్ కమిటీ జరిపిన దర్యాప్తు పత్రాలు కూడా మరుగున పడిపోయాయి. హవాలా స్కామ్‌కు సంబంధించి సమాచార హక్కు కింద అమెరికా ఆర్థిక శాఖ నుంచి 417 పత్రాలను సీఎన్‌ఎన్ వార్తా సంస్థ సంపాదించింది. రోజుకు పదివేల డాలర్లుకు మించి కాసినో నుంచి తీసుకెళ్లిన వారి వివరాలను వెల్లడించాలని అమెరికా ఆర్థికశాఖ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ట్రంప్ స్పందించలేదనే విషయం ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది. క్యాసినోలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కూడా ట్రంప్ క్యాసినో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా తెలపలేదు. ఇప్పుడు ఈ హవాలా స్కామ్‌కు సంబంధించి అమెరికా అధ్యక్ష భవనాన్ని మీడియా సంప్రదించగా, తాజ్‌మహల్ క్యాసినోతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ముక్తసరిగా సమాధానం వచ్చింది. ఇప్పుడు సంబంధం లేదా, ఏర్పాటు చేసిననాటి నుంచే సంబంధం లేదా ? అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు.