Hawala Scam
-
హవాలా స్కామ్‌లో డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చెందిన ‘తాజ్ మహల్’ క్యాసినో ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే అమెరికా హవాలా నిరోధక నిబంధనలను ఏకంగా 106 సార్లు ఉల్లంఘించింది. 1990 ఏప్రిల్‌లో ఈ కాసినో ఏర్పాటుకాగా 1998లో అప్పటివరకు నిబంధనలను ఉల్లంఘించినందుకు 4,77,000 వేల డాలర్లను అమెరికా ఆర్థిక విభాగానికి పరిహారంగా చెల్లించింది. ఈ మేరకు అమెరికా ఆర్థిక విభాగంతో చేసుకున్న ఒప్పందం కూడా అమెరికా బ్యాంకు గోప్య చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉంది. 2015 సంవత్సరంలో కూడా ట్రంప్ కాసినో అమెరికా ఆర్థిక సంస్థతో ఇలాంటి ఒప్పందమే చేసుకొంది. ఆనాటి ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు రాలేదు గానీ, 1998లో చేసుకున్న ఒప్పందం డాక్యుమెంట్లు మాత్రం బయటకు వచ్చాయి. వాటిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ న్యూస్ ఏజెన్సీ అప్పట్లోనే విడుదల చేసింది. హవాలా చట్టం నిబంధనలు ఉల్లంఘించిన స్కామ్‌పై అమెరికా ఆర్థిక విభాగానికి చెందిన దర్యాప్తు సంస్థ ‘ఫైనాన్సియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్’ దర్యాప్తు పత్రాలు ఫెడరల్ రికార్డుల్లో మరుగున పడిపోయాయి. రష్యాతో ట్రంప్‌కున్న సంబంధాలపై కూడా అమెరికా పార్లమెంట్ కమిటీ జరిపిన దర్యాప్తు పత్రాలు కూడా మరుగున పడిపోయాయి. హవాలా స్కామ్‌కు సంబంధించి సమాచార హక్కు కింద అమెరికా ఆర్థిక శాఖ నుంచి 417 పత్రాలను సీఎన్ఎన్ వార్తా సంస్థ సంపాదించింది. రోజుకు పదివేల డాలర్లుకు మించి కాసినో నుంచి తీసుకెళ్లిన వారి వివరాలను వెల్లడించాలని అమెరికా ఆర్థికశాఖ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ట్రంప్ స్పందించలేదనే విషయం ఈ పత్రాల ద్వారా తెలుస్తోంది. క్యాసినోలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కూడా ట్రంప్ క్యాసినో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా తెలపలేదు. ఇప్పుడు ఈ హవాలా స్కామ్‌కు సంబంధించి అమెరికా అధ్యక్ష భవనాన్ని మీడియా సంప్రదించగా, తాజ్‌మహల్ క్యాసినోతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదంటూ ముక్తసరిగా సమాధానం వచ్చింది. ఇప్పుడు సంబంధం లేదా, ఏర్పాటు చేసిననాటి నుంచే సంబంధం లేదా ? అన్న విషయాన్ని కూడా స్పష్టం చేయలేదు. -
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
-
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
హవాలా స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. ముఖేష్ కుమార్ అనే ఢిల్లీ వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చానని చెప్పడం అంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. ఇదంతా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోడానికి చేసిన ప్రయత్నమేనని మిశ్రా అన్నారు. ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన చెప్పారు. నాలుగు షెల్ కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల మొత్తం చెక్కుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి వచ్చిందని ఐదు రోజుల క్రితం మిశ్రా ఆరోపించారు. అయితే దీన్ని ముఖేష్ కుమార్ అలియాస్ ముఖేష్ శర్మ ఖండించారు. తాను స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చానన్నారు. పేదలకు సేవ చేయడానికే ఆమ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వస్తోందని భావించి, అందుకు సాయపడాలనే తాను ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో చెప్పారు. ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఆ నాలుగు కంపెనీలు ఈ వ్యక్తివేనని, తాము ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీకి విరాళం ఇచ్చాడని అన్నారు. కానీ ముఖేష్ కుమార్/శర్మ పూర్తి నిజాలు బయట పెట్టడంలేదని మిశ్రా తాజాగా అంటున్నారు. అతడు రూ. 2 కోట్లు ఇవ్వలేదన్న విషయాన్ని తాను నిరూపించగలనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 లక్షల చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ఉన్న నాలుగు లేఖలను ఆయన చూపించారు. వాటిలో రెండింటిమీదే శర్మ సంతకాలు ఉన్నాయన్నారు. అంటే శర్మ కేవలం కోటి రూపాయలే ఇచ్చారని, మిగిలిన కోటి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఆ 2 కోట్ల విరాళం వచ్చిందని, ఇది మరింత ప్రశ్నార్థకంగా ఉందని కపిల్ మిశ్రా అన్నారు. ఆదాయపన్ను శాఖ కేజ్రీవాల్‌ను దాని గురించి అడిగితే, ఎక్కడినుంచి వచ్చాయో తెలియదన్నారని చెప్పారు. మొత్తం 16 షెల్ కంపెనీలను ఉపయోగించుకోవడం ద్వారా కేజ్రీవాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. -
హవాలా మోసాలపై బాబు స్పందించాలి
-
హవాలా మోసాలపై బాబు స్పందించాలి: మధు
విజయవాడ : రాష్ట్రంలో వెలుగుచూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖ, నేడు విజయవాడలో వెలుగు చూసిన హవాలా కుంబకోణాలపై చిత్తశుద్ది వుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే హవాలా మాఫియా చెలరేగి పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపడం అంటే ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నీ ఉల్లగించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం నెటిజెన్ల పై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నదీ, సముద్రతీర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనం నెత్తిన ఆక్వా పిడుగు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవిష్కరించారు. -
వేల కోట్ల హవాలా రాకెట్ గుట్టురట్టు
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఓ భారీ హవాలా స్కాం గుట్టును రట్టు చేసింది. సామాన్యుల పత్రాలను దొంగిలించి భారీమొత్తాన్ని దేశం నుంచి బయటకు పంపేస్తున్న వైనాన్ని బయటపెట్టింది. ఈ స్కాం దాదాపు రూ. 2వేల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో నాలుగు జాతీయ బ్యాంకులు, ఒక ప్రైవేటు బ్యాంకు పాత్ర కూడా ఉందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి 2016 మార్చి వరకు దక్షిణ ముంబైలోని ఆయా బ్యాంకు శాఖల్లో జరిగిందని చెప్పారు. చాలా స్కాముల్లో జరిగినట్లే ఇక్కడ కూడా ఇందులో పేర్లున్నవాళ్లకు అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేకపోగా.. అసలు ఇలా జరిగిందని కూడా తెలియదు. ఉదాహరణకు సినిమాహాల్లో పనిచేసే ఒక కార్మికుడి పేరుతో ఖాతా తెరిచి.. దాన్నుంచి విదేశాల్లో ఉన్న వేరే ఖాతాకు రూ. 400 కోట్లు పంపారు. అలాగే గొవాండీ రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక స్వీపర్, ఒక టికెట్ కలెక్టర్, ఘట్కోపర్ వద్ద పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి.. వీళ్ల పేర్లతో ఖాతాలు తెరిచి రూ. 400-600 కోట్ల వరకు విదేశీ ఖాతాలకు పంపారు. బోగస్ కంపెనీ ఆఫీసులు నెలకొల్పి, ఈ లావాదేవీలు పూర్తికాగానే వాటిని మూసేస్తున్నారని.. నల్లధనాన్ని పన్నుల బాధ లేని విదేశాలకు పంపడమే వీళ్ల ఉద్దేశమని డీఆర్ఐ అధికారి ఒకరు వివరించారు. ఈ స్కాం మొత్తం ఒక కంపెనీ ద్వారానే జరిగిందని, దాని అడ్రస్ మస్జిడ్ బందర్ ప్రాంతంలో ఉన్నట్లు చూపించారని, ఆగ్నేయాసియా దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్లు చెప్పారని అన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం మొత్తం స్కాం విలువ రూ. 2,232 కోట్లని తెలిపారు. ఇంత మొత్తం విలువగల ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఈ డబ్బు పంపినట్లు చూపించినా.. వాస్తవానికి వాటి అసలు ఖరీదు రూ. 25 కోట్లు మాత్రమేనన్నారు. ఇంత పెద్ద పెద్ద లావాదేవీలు జరుగుతున్నా వాటిని బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. బంగారం, వజ్రాలను దేశంలోకి స్మగ్లింగ్ చేసుకుని, దానికి సంబంధించిన మొత్తాలను గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు హవాలా ద్వారా పంపుతారని కూడా ఆయన వివరించారు.