హవాలా మోసాలపై బాబు స్పందించాలి: మధు
విజయవాడ : రాష్ట్రంలో వెలుగుచూస్తున్న హవాలా మోసాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న విశాఖ, నేడు విజయవాడలో వెలుగు చూసిన హవాలా కుంబకోణాలపై చిత్తశుద్ది వుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అధికార పార్టీ నేతల అండదండలతోనే హవాలా మాఫియా చెలరేగి పోతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సోషల్ మీడియాపై ఉక్కు పాదం మోపడం అంటే ముఖ్యమంత్రి రాజ్యాంగాన్నీ ఉల్లగించడమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం నెటిజెన్ల పై పెట్టిన కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నదీ, సముద్రతీర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనం నెత్తిన ఆక్వా పిడుగు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆవిష్కరించారు.