రాజుగారు వెళ్తున్నారంటే మరి మాటలా.. రాజాధిరాజ దండకాలు.. విచ్చేస్తున్నారహో అంటూ సైనికుల గర్జనలు.. అన్నీ కామనేగా.. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఆదివారం దాదాపు అలాంటి సీనే రిపీటైంది. మూడ్రోజుల మహాపట్టాభిషేక మహోత్సవంలో భాగంగా థాయ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్ సమీపంలోని ప్రముఖ బౌద్ధాలయాల్లో పూజలు చేయడానికి గ్రాండ్ ప్యాలెస్ నుంచి తన పరివారంతో ఇలా పల్లకీలో అంగరంగ వైభవంగా తరలివెళ్లారు. దీంతో రాజుగారిని చూడ్డానికి జనం వీధివీధినా పోటెత్తారు. శనివారం మహా వజిరా అధికారికంగా థాయ్ రాజుగా పట్టాభిషిక్తులయ్యారు. 70 ఏళ్ల క్రితం మహా వజిరా తండ్రికి పట్టాభిషేకం జరిగింది. చాన్నాళ్ల తర్వాత దేశంలో ఈ వేడుక జరుగుతుండటంతో థాయ్‌లాండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment