
మెదడు వేగానికి కారణం తెలిసింది..
మనం చేసే పనులు, ఆలోచనలు ఎప్పుడూ ఒకే వేగంతో ఉంటాయా.
లండన్: మనం చేసే పనులు, ఆలోచనలు ఎప్పుడూ ఒకే వేగంతో ఉంటాయా..? ఉండవు కదా! అవసరాలు, పరిస్థితులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. దీనికి తగ్గట్టే మన మెదడు కూడా దాని పనితీరును, వేగాన్ని మార్చుకుంటుంది. మెదడు వేగంగా పనిచేయడానికి గల కారణాన్ని లండన్ పరిశోధకులు కనుగొన్నారు. మెదడులో ఉండే ‘హిప్పో క్యాంపస్’ అనే ప్రాంతమే మెదడు వేగాన్ని సమన్వయ పరుస్తున్నట్టు ధృవీకరించారు. అవసరమైన సందర్భాల్లో మెదడు ఆలోచించే వేగాన్ని పెంపొందించేందుకు కూడా ఇదే కారణమని తెలిపారు. మెదడు వేగానికి కారణాన్ని కనుగొన్న తొలి అధ్యయనం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు.
దీనికి సంబంధించి ఎలుకలపై చేసిన ప్రయోగంలో వాటి జ్ఞాపకశక్తితో సంబంధం ఉన్న నాడీ కణాల వలయాన్ని పరిశోధకులు గుర్తించారు. దీని ఆధారంగానే మెదడు వేగానికి కారణాన్ని కనిపెట్టగలిగామని చెప్పారు. మెదడులోని కొన్ని నిర్మాణాలు ఎలుకలు, మనుషుల్లో ఒకే విధంగా ఉన్నాయని, కాబట్టి ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగా మానవులలో కూడా ఇదే విధంగా జరుగుతున్నట్టు అవగాహనకు వచ్చామని అన్నారు. పార్కిన్‌సన్, డిమెన్షియా.. వంటి మానసిక రుగ్మతలు ఉన్న వారికి ఈ నిర్మాణాల్లో లోపాలు ఉన్నట్టు తెలిపారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ‘న్యూరాన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.