
తుపాకీ గురిపెట్టి పెళ్లి చేసుకున్నాడు
ఇస్లామాబాద్: తన భార్యను భారత హైకమిషన్ అధికారులు నిర్బంధించారని తాహిర్ అలీ అనే పాకిస్తానీ ఫిర్యాదు చేసిన కేసు కొత్త మలుపు తీసుకుంది. తలకు తుపాకీ గురిపెట్టి అలీ తనను వివాహమాడాడని అతని భార్య ఉజ్మా(20) ఆరోపించింది. ఈ మేరకు ఆమె ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చింది. అలీ తన ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సైతం లాక్కున్నాడని పేర్కొంది.
తనను స్వదేశం పంపించాలని కోరింది. ఇంతకు ముందే వివాహమై, నలుగురు పిల్లలున్నారన్న విషయాన్ని దాచిపెట్టి అలీ తనను పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఉజ్మా కేవలం విజిటింగ్ వీసాలతోనే తమ దేశంలోకి అడుగుపెట్టినట్లు పాక్ వర్గాలు తెలిపాయి. ఆమెకు న్యాయసహాయం అందించడంతో పాటు ఈ విషయమై పాక్ విదేశాంగ కార్యాలయం, ఉజ్మా కుటుంబంతో చర్చిస్తున్నట్లు భారత్ పేర్కొంది. మలేసియాలో పరిచయమైన అలీ, ఉజ్మాలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాఘా సరిహద్దు ద్వారా మే1న పాక్ చేరుకున్న ఉజ్మా, మే 3న అలీని పెళ్లాడింది.