కాంటాక్ట్ లెన్సులు ఇక చీకట్లోనూ చూపునిస్తాయ్!
వాషింగ్టన్: జేమ్స్‌బాండ్ సినిమా తరహాలో చిమ్మచీకటిలో సైతం పరిసరాల్లో మనుషులు, జంతువుల సంచారాన్ని చూపగలిగే వినూత్న కాంటాక్ట్ లెన్సులను యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నారు. సాధారణ గది ఉష్ణోగ్రత వద్దే పనిచేసేలా వారు రూపొందించిన గ్రాఫీన్ లైట్ డిటెక్టర్లు పరిసరాల్లో పూర్తిస్థాయి ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రమ్(పరారుణ వర్ణపటం)ను పసిగడతాయట. దీంతో మామూలు కాంటాక్ట్ లెన్సులతో కూడా చీకట్లో ఇన్‌ఫ్రారెడ్ చూపు త్వరలోనే సాధ్యం కానుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇలాంటి ఇన్‌ఫ్రారెడ్ డిటెక్టర్లు ఇదివరకే వచ్చినా.. వాటిని ఎల్లప్పుడూ చల్లబర్చాల్సి ఉండటం ప్రతిబంధకంగా ఉంది. అయితే గ్రాఫీన్ డిటెక్టర్లు గది ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచే యడమే కాకుండా వాటిని కాంటాక్ట్ లెన్సులు, మొబైల్‌ఫోన్‌లకు కూడా అనుసంధానం చే యొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాగా చీకట్లో మనుషులను పసిగట్టేందుకే కాకుండా.. రోగుల శరీరంలో రక్తప్రసరణను వైద్యులు పర్యవేక్షించేందుకు, పర్యావరణంలో రసాయనాలను గుర్తించేందుకు కూడా ఇన్‌ఫ్రారెడ్ విజన్ పరికరాలు ఉపయోగపడతాయట.