'ఆ పాట' వెనుక ఆమె విజయం | The Happy Birthday Song is Officially in the Public Domain | Sakshi
Sakshi News home page

'ఆ పాట' వెనుక ఆమె విజయం

Published Mon, Sep 28 2015 3:27 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

'ఆ పాట' వెనుక ఆమె విజయం

'ఆ పాట' వెనుక ఆమె విజయం

శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఎవరి పుట్టిన రోజు వేడుక జరిగినా కేక్ కట్ చేయడం, ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ ఆంగ్ల పాట పల్లవిని అందుకోవడం సాధారణమే. ఈ పాట వెనక పెద్ద కథ ఉందని, పాట పేటెంట్‌ను దక్కించుకున్న అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘వార్నర్-ఛాపెల్’ అంతర్జాతీయంగా కళాకారుల నుంచి ఏటా 13.5 కోట్ల రూపాయలు రాయల్టీగా వసూలు చేస్తోందని, అలా ఇప్పటి వరకు 132 కోట్ల రూపాయలు వసూలు చేసిందనే విషయం మనలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విస్తృతంగా నాటుకుపోయి, విశేష ప్రాచుర్యం పొందిన ‘హాపీ బర్త్ డే టు యూ’ అనే పాటపై ఓ మ్యూజిక్ కార్పొరేట్ కంపెనీ పెత్తనం ఏమిటంటూ భారత సంతతికి చెందిన పాప్ సింగర్ రూపా మార్య కోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఆమె పోరాటం కారణంగా నాలుగు రోజుల క్రితం కాలిఫోర్నియా కోర్టు  ఆ బర్త్ డే పాట లిరిక్స్ ప్రజల సొత్తంటూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఇంతకాలం కళాకారుల నుంచి రాయల్టీగా వసూలు చేసిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. పాట పాడిన తీరు అంటే, మెలడీపై మాత్రం ‘వార్నర్-చాపెల్’ మ్యూజిక్ కంపెనీకి పేటెంట్ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

వాస్తవానికి ‘గుడ్ మార్నింగ్ టు ఆల్’ అనే పాట నుంచి ‘హ్యాపీ బర్త్ డే’ పాట పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆ పాట ట్యూన్‌ను మాత్రం మొదటిసారి 1893లో కెంటకీకి చెందిన ఇద్దరు సిస్టర్స్ మిల్‌డ్రెడ్ జె.హిల్, పాటీ స్మిత్ హిల్‌లు కంపోజ్ చేశారు. 1935లో ఈ పాటను ‘క్లేటన్ ఎఫ్. సమ్మీ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించి కాపీ రైట్‌ను పొందింది. 1988లో ఇదే పాటను  రీ కంపోజ్ చేసిన ‘వార్నర్-ఛాపెల్’ కంపెనీ పేటెంట్‌ను పొందింది. ప్రజల నుంచి పుట్టిన ఈ పాట ప్రజల సంస్కృతిలో భాగమైందని, అందువల్ల ఈ పాట ఒరిజనల్ ట్యూన్‌పైనాగానీ, లిరిక్స్‌పైనాగానీ కంపెనీకి ఎలాంటి హక్కులు ఉండవని కాలిఫోర్నియా కోర్టు తేల్చింది.

ఈ తీర్పునకు కారణమైన సింగర్ రూపా మార్యాను కళాకారులంతా ప్రశంసిస్తున్నారు. భారత్‌లోని పంజాబ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వలసపోయిన కుటుంబంలో రూపా మార్య జన్మించారు. జాజ్ నుంచి పంక్, రెగ్గీ తదితర పలు పాశ్చాత్య సంగీత రీతుల ద్వారా మార్య సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

హాపీ బర్త్ డే పాట పేటెంట్‌పై పోరాడాలనే స్ఫూర్తి ఎలా వచ్చిందంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకిష్టమైన శాన్ ఫ్రాన్సిస్కో వేదికపై నా 38వ పుట్టిన రోజున నేను కచేరి ఇస్తున్నాను. ఆ సందర్భంగా నా బ్యాండ్ బృందం ఈ పాటను నన్ను ఉద్దేశించి పాడింది. నేనూ వారితోని గొంతు కలిపాను. ఆ కచేరిలో పాడిన పాటలను లైవ్‌గా రికార్డు చేశాం. ఆ పాటలను సీడీ ద్వారా మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించాం. వార్నర్-ఛాపెల్ కంపెనీకి రాయల్టీ కింద 20 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని నా న్యాయవాది చెప్పారు.

అదేమిటి? ప్రజల పాటకు కార్పొరేట్ కంపెనీలకు రాయల్టీ చెల్లించడం ఏమిటంటూ కోపం వచ్చింది. మాన్‌శాంటో లాంటి కంపెనీలు పేటెంట్ల పేరిట రైతులను వేదిస్తున్న అంశాలు గుర్తొచ్చాయి. ఆరుగాలం కష్టపడే రైతులకు న్యాయ పోరాటం జరిపేందుకు తీరిక, డబ్బులు ఉండవు, కానీ నాకు అలాంటి పరిస్థితి లేదు. దీనిపై న్యాయ పోరాటం చేయగలమా ? అని నా న్యాయవాదిని ప్రశ్నించాను. తాను చేస్తానని చెప్పారు. విజయం సాధించారు’ అని వివరించారు.

తాజాగా తాను విడుదల చేసిన ‘ఓవల్’ మ్యూజిక్ ఆల్బమ్‌లో భారత ప్రముఖ గజల్ సింగర్ జగ్జీత్ సింగ్ పాడిన తనకిష్టమైన పాట ‘వో కాగజ్ కీ కష్తీ’ చేర్చి భారత్‌లో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చానని, దాని కోసం త్వరలోనే భారత్ పర్యటనకు వస్తున్నానని మార్య తెలిపారు. వో కాగజ్ కీ కష్తీ పాట జగ్జీత్ సింగ్ సొంతమవడం వల్ల ఆయనకు తాను రాయల్టీ కూడా చెల్లిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement