Happy Birthday song
-
స్పీకర్ ను సర్ప్రైజ్ చేసిన లోకసభ సభ్యులు
న్యూఢిల్లీ : లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను సభ సభ్యులు సర్ ప్రైజ్ చేశారు. బుధవారం ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని సభ సభ్యులందరూ 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను ఆలపించారు. వారి బర్త్ డే సాంగ్ మురిసిపోయిన సుమిత్రా మహాజన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సభ ప్రారంభం కాగానే సభ్యులందరూ ఒక్క సారిగా పైకి లేచి, హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. ఆయురారోగ్యాలతో, సుదీర్ఘ కాలం పాటు జీవించాలని కోరుకుంటూ వారు ప్రార్థన నిర్వహించారు. వారి ప్రార్థనలకు ఆమె ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలయ్యారు. నేడు ఆమె 73 సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సభ మొత్తం తరుఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్, ఆమెకు బర్త్ డే శుభాకాంక్షలను తెలిపారు.''సభ్యులందరి తరుఫున మీరు సుదీర్ఘ కాలం పాటు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాం'' అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన స్పీకర్ వారి శుభాకాంక్షలకు ఎంతో ఆనందం వ్యక్తంచేశారు. సభ నిర్వహించేటప్పుడు తను వ్యవహరించే తీరును, మందలింపు చర్యలను ఎవరూ సీరియస్ తీసుకోరని ఆశిస్తున్నట్టు సుమిత్రా పేర్కొన్నారు. -
'ఆ పాట' వెనుక ఆమె విజయం
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ఎవరి పుట్టిన రోజు వేడుక జరిగినా కేక్ కట్ చేయడం, ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ ఆంగ్ల పాట పల్లవిని అందుకోవడం సాధారణమే. ఈ పాట వెనక పెద్ద కథ ఉందని, పాట పేటెంట్‌ను దక్కించుకున్న అమెరికాలోని ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ‘వార్నర్-ఛాపెల్’ అంతర్జాతీయంగా కళాకారుల నుంచి ఏటా 13.5 కోట్ల రూపాయలు రాయల్టీగా వసూలు చేస్తోందని, అలా ఇప్పటి వరకు 132 కోట్ల రూపాయలు వసూలు చేసిందనే విషయం మనలో చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో విస్తృతంగా నాటుకుపోయి, విశేష ప్రాచుర్యం పొందిన ‘హాపీ బర్త్ డే టు యూ’ అనే పాటపై ఓ మ్యూజిక్ కార్పొరేట్ కంపెనీ పెత్తనం ఏమిటంటూ భారత సంతతికి చెందిన పాప్ సింగర్ రూపా మార్య కోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఆమె పోరాటం కారణంగా నాలుగు రోజుల క్రితం కాలిఫోర్నియా కోర్టు ఆ బర్త్ డే పాట లిరిక్స్ ప్రజల సొత్తంటూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఇంతకాలం కళాకారుల నుంచి రాయల్టీగా వసూలు చేసిన సొమ్మును తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. పాట పాడిన తీరు అంటే, మెలడీపై మాత్రం ‘వార్నర్-చాపెల్’ మ్యూజిక్ కంపెనీకి పేటెంట్ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. వాస్తవానికి ‘గుడ్ మార్నింగ్ టు ఆల్’ అనే పాట నుంచి ‘హ్యాపీ బర్త్ డే’ పాట పుట్టుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆ పాట ట్యూన్‌ను మాత్రం మొదటిసారి 1893లో కెంటకీకి చెందిన ఇద్దరు సిస్టర్స్ మిల్డ్రెడ్ జె.హిల్, పాటీ స్మిత్ హిల్లు కంపోజ్ చేశారు. 1935లో ఈ పాటను ‘క్లేటన్ ఎఫ్. సమ్మీ పబ్లిషింగ్ కంపెనీ ప్రచురించి కాపీ రైట్ను పొందింది. 1988లో ఇదే పాటను రీ కంపోజ్ చేసిన ‘వార్నర్-ఛాపెల్’ కంపెనీ పేటెంట్‌ను పొందింది. ప్రజల నుంచి పుట్టిన ఈ పాట ప్రజల సంస్కృతిలో భాగమైందని, అందువల్ల ఈ పాట ఒరిజనల్ ట్యూన్పైనాగానీ, లిరిక్స్పైనాగానీ కంపెనీకి ఎలాంటి హక్కులు ఉండవని కాలిఫోర్నియా కోర్టు తేల్చింది. ఈ తీర్పునకు కారణమైన సింగర్ రూపా మార్యాను కళాకారులంతా ప్రశంసిస్తున్నారు. భారత్‌లోని పంజాబ్ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వలసపోయిన కుటుంబంలో రూపా మార్య జన్మించారు. జాజ్ నుంచి పంక్, రెగ్గీ తదితర పలు పాశ్చాత్య సంగీత రీతుల ద్వారా మార్య సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. హాపీ బర్త్ డే పాట పేటెంట్‌పై పోరాడాలనే స్ఫూర్తి ఎలా వచ్చిందంటూ మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ ‘నాకిష్టమైన శాన్ ఫ్రాన్సిస్కో వేదికపై నా 38వ పుట్టిన రోజున నేను కచేరి ఇస్తున్నాను. ఆ సందర్భంగా నా బ్యాండ్ బృందం ఈ పాటను నన్ను ఉద్దేశించి పాడింది. నేనూ వారితోని గొంతు కలిపాను. ఆ కచేరిలో పాడిన పాటలను లైవ్‌గా రికార్డు చేశాం. ఆ పాటలను సీడీ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయించాం. వార్నర్-ఛాపెల్ కంపెనీకి రాయల్టీ కింద 20 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని నా న్యాయవాది చెప్పారు. అదేమిటి? ప్రజల పాటకు కార్పొరేట్ కంపెనీలకు రాయల్టీ చెల్లించడం ఏమిటంటూ కోపం వచ్చింది. మాన్‌శాంటో లాంటి కంపెనీలు పేటెంట్ల పేరిట రైతులను వేదిస్తున్న అంశాలు గుర్తొచ్చాయి. ఆరుగాలం కష్టపడే రైతులకు న్యాయ పోరాటం జరిపేందుకు తీరిక, డబ్బులు ఉండవు, కానీ నాకు అలాంటి పరిస్థితి లేదు. దీనిపై న్యాయ పోరాటం చేయగలమా ? అని నా న్యాయవాదిని ప్రశ్నించాను. తాను చేస్తానని చెప్పారు. విజయం సాధించారు’ అని వివరించారు. తాజాగా తాను విడుదల చేసిన ‘ఓవల్’ మ్యూజిక్ ఆల్బమ్‌లో భారత ప్రముఖ గజల్ సింగర్ జగ్జీత్ సింగ్ పాడిన తనకిష్టమైన పాట ‘వో కాగజ్ కీ కష్తీ’ చేర్చి భారత్‌లో విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చానని, దాని కోసం త్వరలోనే భారత్ పర్యటనకు వస్తున్నానని మార్య తెలిపారు. వో కాగజ్ కీ కష్తీ పాట జగ్జీత్ సింగ్ సొంతమవడం వల్ల ఆయనకు తాను రాయల్టీ కూడా చెల్లిస్తానని చెప్పారు. -
'హ్యాపీ బర్త్ డే..' ఇక అందరిదీ!
- పాట అందరిది.. ఏ ఒక్కరికో హక్కులు ఉండబోవన్న ఫెడరల్ కోర్టు - బర్త్ డే సాంగ్ పేటెంట్‌పై వివాదానికి తెర కాలిఫోర్నియా: ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. పుట్టినరోజు పాటపై పట్టువిడుపులకు పోవద్దని, ఇప్పటికే విశ్వజనీనమైన ఈ పాట అందరికీ చెందిందని, ఏ ఒక్కరికో దీనిపై హక్కులు కల్పించలేమని అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు.. 'హ్యాపీ బర్త్ డే టు యు' అనే పాటకు ఇకపై రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అమెరికాకే చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ ఇప్పటివరకు ఈ పాటపై రాయల్టీ పొందుతూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బర్త్ డే సాంగ్ పై హక్కును నిరసిస్తూ వార్నర్ సంస్థకు వ్యతిరేకంగా పోరాడింది ఓ మహిళ కావటం గమనార్హం. బర్త్ డే సాంగ్ ను ఎవరు రాశారు? ఎప్పటి నుంచి ఇది వాడుకలోకి వచ్చింది? తదితర వివరాలను పొందుపరుస్తూ జెన్నీఫర్ నెల్సన్ అనే మహిళా దర్శకురాలు ఓ డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలోనూ బర్త్ డే సాంగ్ ఉండటంతో రాయల్టీ చెల్లించాల్సిందేనని వార్నర్ సంస్థ డిమాండ్ చేసింది. 'అదేంటి పాట చరిత్రను వెలికితీసినా రాయల్టీ కట్టాల్సిందేనా!' అని వాపోయిన జెన్నీఫర్.. వార్నర్ సంస్థ తీరును నిరసిస్తూ కోర్టును ఆశ్రయించింది. వార్నర్ కు వ్యతిరేకంగా మరి కొందరూ వాదులుగా చేరారు. విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇదీ పుట్టినరోజు పాట నేపథ్యం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం 'హ్యాపీ బర్త్ డే టూ యూ'.. ఇంగ్లీష్ లో మోస్ట్ పాపులర్ సాంగ్. అమెరికాకు చెందిన పాటీ హిల్, మిల్డెడ్ అనే సొదరీమణులు 1893లో ఈ పాటను రాసి, ట్యూన్ చేసినట్లు ఆధారాలున్నాయి. కిండర్ గార్డెన్ బోధకురాలైన పాటీ.. పియానో విధ్వాంసురాలైన తన సోదరి మిల్డెడ్ తో కలిసి.. పిల్లలకు సులభంగా అర్థమయ్యే, నేర్చుకోగలిగే పాటలను రూపొందించేవారు. ఆ క్రమంలో రూపొందించిన 'గుడ్ మార్నింగ్ టు ఆల్' ట్యూన్ నుంచి 'హ్యాపీ బర్త్ డే టు యు' పుట్టింది. 1912లో మొదటిసారి ఈ పాట అచ్చయింది. తర్వాతి కాలంతో సమ్మీ సంస్థ ఈ పాటపై కాపీరైట్ (1935లో) సాధించింది. 1990లో వార్నర్ బ్రదర్స్ కు చెందిన వార్నర్- చాపెల్ మ్యూజిక్ కంపెనీ.. 15 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 100 కోట్లు) చెల్లించి 2030 వరకు హ్యాపీ బర్త్ డే పాటపై హక్కులు పొందింది. కాగా జెన్నీఫర్ లారెన్స్ పోరాటంతో బర్త్ డే పాట అందరి సొంతమైనట్లయింది.