
షార్క్ తోక పట్టుకులాగాడు.. అంతే!
దారి తప్పి బీచ్ తీరానికి వచ్చిన చిన్న టైగర్ షార్క్ చేపను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. తోక పట్టుకునేందుకు ప్రయత్నించిన అతని చేతిని షార్క్ కొరికేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన నార్త్ కరోలినాలోని వ్రైట్స్‌విల్లే బీచ్‌లో చోటు చేసుకుంది.
ఇద్దరు స్నేహితులు టైగర్ షార్క్‌ను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దారి తప్పి లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వచ్చిందో టైగర్ షార్క్ చేప పిల్ల. తిరిగి లోతు ప్రాంతానికి వెళ్లడానికి యత్నిస్తున్న దాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.
నడుము లోతు ఉన్న నీటిలోకి దిగి షార్క్ తోక పట్టుకున్నాడు ఇద్దరి స్నేహితుల్లో ఒక వ్యక్తి. అంతే ఒక్కసారిగా వెనక్కు మళ్లిన షార్క్ అతని చేతిని కొరికేసింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తం స్రావం కావడం మొదలైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని మరో చేత్తో అదిమి పట్టుకున్న వ్యక్తి ఒడ్డుకు పరుగెత్తాడు. ఆ తర్వాత ఎలాగో షార్క్‌ను పట్టుకుని తిరిగి సముద్రంలోకి వదిలేశారని తెలిసింది. గాయాలైన వ్యక్తి పరిస్ధితి ఎలా ఉందనే విషయంపై సమాచారం లేదు.